Begin typing your search above and press return to search.

సాయి పల్లవి గ్యాప్‌ తీసుకుందా? వచ్చిందా?

గత ఏడాది తండేల్‌ సినిమాతో వచ్చిన తర్వాత సాయి పల్లవి పూర్తిగా బాలీవుడ్‌కి పరిమితం అయినట్లుగా వరుస హిందీ సినిమాలు చేస్తోంది.

By:  Ramesh Palla   |   7 Sept 2026 4:00 PM IST
సాయి పల్లవి గ్యాప్‌ తీసుకుందా? వచ్చిందా?
X

తెలుగు ప్రేక్షకులు అభిమానంతో లేడీ పవర్‌స్టార్ అని పిలుచుకునే సాయి పల్లవి టాలీవుడ్‌కి గ్యాప్‌ తీసుకుందా అనిపిస్తుంది. గడిచిన ఐదేళ్లలో సాయి పల్లవి తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. అందులో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఈమె హీరోయిన్‌గా నటించి చివరగా విడుదలైన సినిమాల్లో తండేల్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు మించిన వసూళ్లతో తండేల్‌ ఆ ఏడాది టాప్ చిత్రాల జాబితాలో నిలిచిన విషయం తెల్సిందే. అంతుకు ముందు లవ్‌ స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్‌, విరాట పర్వం సినిమాలతో వచ్చి హిట్ కొట్టింది. ముఖ్యంగా విరాట పర్వం సినిమాతో సాయి పల్లవికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇలా వరుస విజయాలు దక్కించుకున్న సాయి పల్లవికి తెలుగులో ఎక్కువ ఆఫర్లు రావడం లేదా, లేదంటే సాయి పల్లవి వచ్చిన ఆఫర్లను తిరస్కరిస్తుందా అనేది చాలా మంది అనుమానం.

తండేల్‌ మూవీతో సాయి పల్లవి సూపర్‌ హిట్‌...

గత ఏడాది తండేల్‌ సినిమాతో వచ్చిన తర్వాత సాయి పల్లవి పూర్తిగా బాలీవుడ్‌కి పరిమితం అయినట్లుగా వరుస హిందీ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే 'ఏక్‌ దిన్‌' టైటిల్‌తో రూపొందిన సినిమాతో సాయి పల్లవి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో రూపొందిన ఏక్‌ దిన్‌ సినిమా కమర్షియల్‌ ఫలితాన్ని పక్కన పెడితే సాయి పల్లవి నటనకు ఎప్పటిలాగే మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచింది అంటూ రివ్యూలు వచ్చాయి. ఏక్‌ దిన్‌ సినిమా తర్వాత సాయి పల్లవి క్రేజ్‌ బాలీవుడ్‌లో మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న 'రామాయణ' సినిమాతోనూ సాయి పల్లవి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీలో రూపొందిన రామాయణ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

బాలీవుడ్‌ రామాయణ సినిమాలో సీతగా...

రామాయణ సినిమా కంటే ముందు సాయి పల్లవి నటించిన తమిళ్‌ 'ఓమ్‌' మూవీ విడుదల కాబోతుంది. వచ్చేనెలలో విడుదల కాబోతున్న ఓమ్‌ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు. హిట్‌ చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రాజ్‌కుమార్‌ పెరియాస్వామి దర్శకత్వంలో స్వయంగా ధనుష్‌ ఈ సినిమాను నిర్మించాడు. సాయి అభ్యంకర్‌ సంగీతం అందించిన ఓమ్‌ సినిమాలో సాయి పల్లవి పాత్ర విషయమై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ధనుష్ సినిమా కనుక సాయి పల్లవి పాత్రకు గొప్ప ప్రాధాన్యత ఉండక పోవచ్చు అనేది కొందరి అభిప్రాయం. హిందీ, తమిళ్‌ సినిమాలు చేస్తున్న సాయి పల్లవి తెలుగు సినిమాలను మాత్రం ఎందుకు దూరం పెడుతున్నట్లు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నాయి. సాయి పల్లవి కావాలని తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది అనే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆమెకు తగ్గ కథ రాకపోవడం వల్ల టాలీవుడ్‌కి దూరంగా ఉండాల్సి వస్తుందని కొందరు అంటున్నారు.

టాలీవుడ్‌లో సాయి పల్లవి సినిమాలు...

మంచి కథతో వస్తే సాయి పల్లవి కచ్చితంగా ఓకే చెబుతుందని చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ అంటారు. గతంలో అది నిరూపితం అయ్యింది. కమర్షియల్‌ ఎలిమెంట్స్ లేకున్నా నటనకు ఆస్కారం ఉంటే కచ్చితంగా సాయి పల్లవి సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కనుక సాయి పల్లవి టాలీవుడ్‌కి గ్యాప్‌ తీసుకోలేదని, మంచి కథలు తన వద్దకు రాకపోవడం వల్ల గ్యాప్ వచ్చిందని ఆమె అభిమానులు అంటున్నారు. రామాయణ తర్వాత కచ్చితంగా టాలీవుడ్‌లో బిగ్‌ కమ్‌బ్యాక్‌ మూవీతో సాయి పల్లవి అభిమానులను అలరించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

క్రేజ్ ఉంది కదా అని, బ్యాక్ టు బ్యాక్‌ ఏదో ఒక సినిమా చేసే రకం సాయి పల్లవి కాదు. కనుక ఆమె ఎంపిక ఆచితూచి ఉంటుంది. అందుకే ఆమె సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా రామాయణ లో చేస్తున్న సీత పాత్ర పై ఉన్నట్లు తెలుస్తోంది. రామాయణ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి సినిమా ఉంటుందని తెలుస్తోంది. కనుక ఈ ఏడాదిలోనే కాకుండా వచ్చే ఏడాదిలోనూ టాలీవుడ్‌లో సాయి పల్లవి డైరెక్ట్‌ మూవీ రాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.