అన్ని నోళ్లు అలా మూయించిన సాయిపల్లవి! ఇంకేమి కౌంటర్లు వేస్తారు?
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాలన్నింటికీ సమాధానం చెప్పేలా ఉన్నాయి.
By: Sivaji Kontham | 26 Oct 2026 8:12 PM ISTనితేష్ తివారీ `రామాయణం పార్ట్ 1` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. పాన్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సీతాదేవి పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక వర్గం నుంచి తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమయ్యాయి. గతంలో సాయిపల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. తనకు హిందూ సంస్కృతిపై సరైన గౌరవం లేదని.. అలాంటి వ్యక్తి పవిత్రమైన సీతాదేవి పాత్రను ఎలా పోషిస్తుందంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాలన్నింటికీ సమాధానం చెప్పేలా ఉన్నాయి. సీతాదేవి పాత్రలో నటించడం గురించి మాట్లాడుతూ.. ``నేను సీత పాత్ర పోషిస్తున్నప్పుడు నా సొంత తెలివితేటలు లేదా బుద్ధిని ఉపయోగించలేదు. ఎందుకంటే ఆ మహోన్నతమైన పాత్రకు నా వైపు నుంచి ఇచ్చేందుకు ఏమీ లేదు. ఆ పవిత్రమైన పాత్ర నుంచి నేను ఏమి నేర్చుకోగలననేదే ఆలోచించాను`` అని పేర్కొన్నారు.
సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు భారతీయ సంస్కృతి, రామాయణం, సీతాదేవి పాత్ర పై తనకు ఉన్న అపారమైన గౌరవాన్ని, నమ్రతను తెలియజేస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాత్ర పవిత్రతను దెబ్బతీయకుండా.. దానికి లొంగిపోయి నటించాలనే ఈ నటి ఆలోచనా దృక్పథం విమర్శకుల నోళ్లు మూయించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీజర్, ట్రైలర్ లో సాయిపల్లవి గ్లింప్స్ చూసాక చాలా మంది తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సాయిపల్లవి సహజసిద్ధమైన ఆహార్యం, అభినయం ముందు అన్ని విమర్శలు కొట్టుకుపోతాయనే నమ్మకం పెరిగింది. సాయిపల్లవి అందం కంటే, ఆమె వ్యక్తిత్వంతో అన్నిటినీ జయిస్తుందన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. తనను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ సాయిపల్లవి తన నట ప్రదర్శనతో ఇచ్చి పడేస్తుందని అభిమానులు సమర్థిస్తున్నారు. కేవలం టీజర్, ట్రైలర్ సరిపోదు.. టోటల్ షోని దొంగిలించే ప్రదర్శన ఇస్తుందని కూడా కొందరు ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తున్నారు.
నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ (శ్రీరాముడిగా), సాయి పల్లవి (సీతాదేవిగా) నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
