నేను అంత అందంగా లేను.. ఈ స్వచ్ఛతే సీత పాత్రకు ఔచిత్యం!
‘రామాయణం’లో సీత పాత్రలో సాయిపల్లవి ఎంపికపై సోషల్ మీడియాలో ప్రశంసలు, విమర్శలు కొనసాగుతున్నాయి. సహజమైన నటన, సంప్రదాయ రూపంతో ఆమె ఈ పాత్రకు సరిపోయిందని అభిమానులు అంటుంటే, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీత పాత్రల ఎంపికపై వచ్చిన వివాదాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఈ విమర్శలు, ప్రశంసలను పక్కనపెట్టి సాయిపల్లవి ‘రామాయణం పార్ట్ 2’పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
By: Sivaji Kontham | 6 Nov 2026 9:23 AM ISTపాన్ వరల్డ్ సినిమాగా విడుదలైన `రామాయణ` గురించి బోలెడంత చర్చ సాగుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలోని సీత పాత్ర గురించి కూడా సోషల్ మీడియాల్లో బిగ్ డిబేట్ నడుస్తోంది. అసలు సాయిపల్లవి ఎంపిక సరైనదేనా? అన్న చర్చ ఇప్పటికీ విడుదల తర్వాతా కొనసాగడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాయిపల్లవిపై కొన్ని విమర్శలు ఎదురవ్వగా.. చాలా ప్రశంసలు కూడా కురుస్తున్నాయి.
నిజానికి సాయిపల్లవి తన సహజసిద్ధమైన నటనతో.. ఎలాంటి మేకప్ లేకుండా వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరుదైన నటి. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించి.. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ నటనపై ఉన్న మక్కువతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు.
ప్రేమమ్ చిత్రంలో నటించినప్పుడు తాను సిమ్రన్ లా, త్రిషలా అందంగా లేనని కొంత భయపడినట్టు కూడా సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు.. సాయిపల్లవి తమిళనాడులోని కోయంబత్తూరు నివాసి. తాను ఒక మలయాళీ అమ్మాయిని కాదని కూడా వెల్లడించారు. అలాగే తన తండ్రి పడుకర్ తెగకు చెందిన వారు కావడంతో ఆయన పడుకర్ భాష మాట్లాడతారని.. తన తల్లి తమిళియన్ అని కూడా వెల్లడించారు.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితిష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్-ఇండియా మైథలాజికల్ ప్రాజెక్ట్ `రామాయణం`లో సీత పాత్రతో చర్చల్లోకొచ్చింది. భారతీయ చారిత్రక, పౌరాణిక కావ్యమైన రామాయణంలో సీత పాత్రకు సాయిపల్లవి నూటికి నూరు శాతం సరిపోతారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రశంసలు కురిసినా కొందరు విమర్శకులు మాత్రం పెదవి విరిచేసారు. ఆమె ముఖంలో ఉండే దైవిక చింతన.. హుందా తనం.. నిండైన సంప్రదాయ రూపం.. స్వచ్ఛమైన మనస్తత్వం ఈ పవిత్రమైన పాత్రకు మరింత వన్నె తెచ్చాయని అభిమానులు బలంగా విశ్వసించారు. సాధారణ హీరోయిన్ల మాదిరిగా కమర్షియల్ హంగులకు పోకుండా... తనకంటూ కొన్ని ప్రత్యేక నైతిక విలువలు పెట్టుకుని ముందుకు వెళ్తున్న సాయిపల్లవికి ఒక డాక్టర్‌గా చదువు పూర్తి చేసుకుని.. ఈ పవిత్రమైన పాత్రను దక్కించుకోవడం కెరీర్‌లోనే పెద్ద మైలురాయి. విమర్శలు సహజం. కానీ చాలా ప్రశంసల్ని కూడా అందుకుంటున్న విషయం మర్చిపోకూడదు. తాను సిమ్రన్ లా, త్రిషలా అందంగా లేకపోయినా ఒక పాన్ ఇండియా ప్రాజెక్టులో అవకాశం అందుకోవడం అంటే అది కేవలం ప్రతిభతోనే సాధ్యమని సాయిపల్లవి నిరూపించారు.
అయితే భారతీయ చలనచిత్ర చరిత్రలో సీతాదేవి పాత్రను పోషించడం ఎంతటి గౌరవమో, అంతేస్థాయిలో బాధ్యత - సవాలుతో కూడుకున్న వ్యవహారం. రామాయణాన్ని, సీతాదేవిని కోట్లాది మంది ప్రజలు పవిత్రంగా పూజిస్తారు కాబట్టి ఆ పాత్ర రూపకల్పన, కాస్ట్యూమ్స్ లేదా నటనలో తేడాలొస్తే భక్తుల నుండి తీవ్రమైన విమర్శలు ఎదురైన సంఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. ఇటీవల `ఆదిపురుష్` చిత్రంలో కృతి సనన్ ధరించిన ఆధునిక తరహా కాస్ట్యూమ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు రాగా... గతంలో `శ్రీరామరాజ్యం` సమయంలో గ్లామర్ ఇమేజ్ ఉన్న నయనతారను సీతగా ఎంచుకోవడంపై సైతం ప్రారంభంలో విమర్శలు వెల్లువెత్తాయి.
సాధారణంగా పౌరాణిక పాత్రల విషయంలో హద్దులు దాటిన గ్లామరైజేషన్, నటీమణుల ఆఫ్-స్క్రీన్ ఇమేజ్ -సినిమాటిక్ స్వేచ్ఛ పేరుతో మూలకథను మార్చడమే విమర్శలకు ప్రధాన కారణాలుగా మారుతుంటాయి. ఈ క్రమంలో పాత్రకు ప్రాణం పోసే కాస్ట్యూమ్స్ నుండి నటన వరకు చిన్న పొరపాటు జరిగినా ప్రేక్షకులు ఏమాత్రం జీర్ణించుకోలేరు. అందుకే సీతాదేవి పాత్రను ఎంచుకోవడం అనేది ఏ నటికైనా ఎంతో సున్నితమైన, రిస్క్‌తో కూడుకున్న పెద్ద సవాలు.
ఈ విమర్శలు-వివాదాల నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుతం సాయిపల్లవికి ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ ఉన్న క్లీన్ అండ్ నిండైన ఇమేజ్ అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం అభినయానికే ప్రాధాన్యమిచ్చే సాయిపల్లవి తన పవిత్రమైన రూపంతో సీత పాత్రలో ఒదిగిపోయిందని చాలా మంది ప్రశంసిస్తున్నారు. అయితే సీతా దేవి అంటే జానకి .. తన అందానికి సరిపడేలా సాయిపల్లవి లేదు! అని విమర్శించే ఒక సెక్షన్ కూడా ఉంది. ప్రపంచంలో ఉన్న అందరినీ ఏక పక్షాన ఆకట్టుకోవడం అనేది ఏ నటికీ సాధ్యపడదు. సాయిపల్లవిపైనా విమర్శలు ఉన్నాయి.. ప్రశంసలు కురుస్తున్నాయి. వీటన్నటినీ మర్చిపోయి రామాయణం పార్ట్ 2 పై ఈ భామ దృష్టి సారించనుందిట.
