సీతామా కి జై .. సాయి పల్లవి కంటే ముందే దిగ్గజ నటీమణులకు నీరాజనాలు!
తనపై వచ్చే ఎలాంటి నెగెటివిటీడినైనా కేవలం తన నటన, అంకితభావం, అసాధారణ ప్రతిభతో మాత్రమే దాటుకుంటూ రావడం సాయిపల్లవికి కొత్తేమీ కాదు.
By: Sivaji Kontham | 28 Oct 2026 10:12 PM ISTనితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం `రామాయణం`లో సాయిపల్లవి సీతాదేవి పాత్రలో నటించడం ప్రస్తుతం భారతీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. పౌరాణిక పాత్రల ఎంపిక విషయంలో ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటించే ఇండియన్ సినిమా రంగంలో సీత వంటి పవిత్రమైన, మహోన్నతమైన పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేయడంపై మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. తనపై దర్శకనిర్మాతలు, హీరోకి ఉన్న నమ్మకం మాత్రం ప్రశంసనీయం. ఈ పాత్ర ద్వారా సాయిపల్లవి తన నటనను నిరూపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో.. ప్రత్యేకించి తెలుగు తెరపై సీతాదేవి పాత్రకు ప్రాణం పోసి.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మేటి కథానాయికల పరంపరను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 1963లో వచ్చిన `లవకుశ` చిత్రంలో మేటి కథానాయిక అంజలీదేవి ప్రదర్శించిన నిండుదనం, పవిత్రత తెలుగువారి మదిలో శాశ్వతంగా నిలిచిపోగా.. బాపు దర్శకత్వంలోని `శ్రీరామ రాజ్యం` (2011)లో నయనతార సీత పాత్రకు అవసరమైన గంభీరతను, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. అలాగే తమిళంలో శ్రీదేవి, టెలివిజన్ రంగంలో రామానంద్ సాగర్ `రామాయణ్` (1987) ద్వారా దీపికా చిఖ్లియా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రత్యక్ష సీతాదేవిగా నీరాజనాలు అందుకున్నారు.
అయితే ఇంతటి ప్రాముఖ్యత, పవిత్రత ఉన్న పాత్రకు సాయిపల్లవి ఎంపికైనప్పుడు సోషల్ మీడియాలో కొందరు చేసిన విమర్శలకు, ట్రోల్స్‌కు లాస్ ఏంజెలెస్‌లోని ప్రతిష్టాత్మక అకాడమీ మ్యూజియమ్ ఆఫ్ మోషన్ పిక్చర్స్ వేదికగా జరిగిన ప్రత్యేక స్క్రీనింగ్ ద్వారా గట్టి సమాధానం లభించింది. హాలీవుడ్ ప్రేక్షకులతో నిండిపోయిన ఆడిటోరియంలో స్క్రీనింగ్ ముగిసిన వెంటనే వేదికపైకి వచ్చిన సాయిపల్లవికి ఊహించని రీతిలో అపూర్వ స్పందన దక్కింది. ముఖ్యంగా హీరో రణ్‌బీర్ కపూర్ కంటే కూడా ఆమెకు ఎక్కువ కేరింతలు లభించడం, ఆడిటోరియం మొత్తం `సీతామా కి జై` అనే నినాదాలతో హోరెత్తిపోవడం తన సాధించిన నైతిక విజయానికి నిదర్శనం.
తనపై వచ్చే ఎలాంటి నెగెటివిటీడినైనా కేవలం తన నటన, అంకితభావం, అసాధారణ ప్రతిభతో మాత్రమే దాటుకుంటూ రావడం సాయిపల్లవికి కొత్తేమీ కాదు. సౌత్ ఇండియాలో గొప్ప నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం సహజ నటనతోనే ప్రేక్షకులను కట్టిపడేయగలదు. ఇప్పుడు సీత పాత్రతో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ విమర్శకుల నోళ్లు మూయించి, గ్లోబల్ ఆడిటోరియం నుంచి సైతం నీరాజనాలు అందుకోవడం తన అంకితభావానికి, కళా పిపాసకు దక్కిన నిజమైన గుర్తింపు.
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పౌరాణిక చిత్రం ద్వారా పాన్ ఇండియా మార్కెట్‌లో సాయిపల్లవి పేరు మార్మోగుతుందని అంచనా వేస్తున్నారు. దిగ్గజ నటీమణులు గతంలో అందించిన అద్భుతమైన నటనకు కొనసాగింపుగా.. తనదైన విశిష్ట శైలిలో సీతాదేవి పాత్రకు జీవం పోసిందనే ఇంకా సినిమా చూడని ప్రజలు నమ్ముతున్నారు. హిందీ ప్రేక్షకులను సైతం తన వైపునకు తిప్పుకోవడంలో సాయిపల్లవి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. నటనతోనే మాట్లాడే ఈ ప్రతిభావంతురాలైన నాయిక భవిష్యత్తులో మరిన్ని గొప్ప శిఖరాలను అధిరోహించి.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
