గార్గి లాంటి రోల్ కోసం అంతా వెయిటింగ్.. సాయి పల్లవి బ్యాలెన్స్ ఇలా..
ఒకవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ కమర్షియల్ సినిమాల్లో మెప్పించడం.. మరోవైపు కథలో బలం ఉంటే హీరోయిన్ లీడ్ రోల్స్ లో కనిపించడం.. ఆ రెండింటినీ ప్యారలల్ గా వెళ్లే హీరోయిన్స్ లో సాయి పల్లవి ముందుంటారు.
By: M Prashanth | 24 July 2026 11:00 AM ISTఒకవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ కమర్షియల్ సినిమాల్లో మెప్పించడం.. మరోవైపు కథలో బలం ఉంటే హీరోయిన్ లీడ్ రోల్స్ లో కనిపించడం.. ఆ రెండింటినీ ప్యారలల్ గా వెళ్లే హీరోయిన్స్ లో సాయి పల్లవి ముందుంటారు. కెరీర్ ప్రారంభం నుంచే గ్లామర్ కంటే యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రేక్షకుల్లో నేచురల్ పెర్ఫార్మర్ గా నిలిచారు. అయితే గార్గి లాంటి స్ట్రాంగ్ లేడీ ఓరియంటెడ్ రోల్ తర్వాత మరోసారి అలాంటి కథలో ఆమె ఎప్పుడు కనిపిస్తారన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
సాయి పల్లవి కెరీర్ ను పరిశీలిస్తే కమర్షియల్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ చిత్రాలు రెండింటినీ ఎంచుకుంటూ ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో కలిసి నటించి విజయాలు అందుకున్నారు. అదే సమయంలో గార్గి, విరాటపర్వం, పావ కదైగల్, దియా వంటి సినిమాల్లో పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న కథలను ఎంపిక చేసుకుని తన టాలెంట్ ను మరోసారి నిరూపించారు.
ప్రత్యేకంగా గార్గి సినిమా సాయి పల్లవి కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. ఒక సాధారణ యువతి తన కుటుంబం కోసం న్యాయపోరాటం చేసే పాత్రలో ఆమె యాక్టింగ్ కు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. భారీ వసూళ్ల కంటే మంచి కథ, గుర్తుండిపోయే పాత్ర కూడా ఒక యాక్ట్రెస్ కు ఎంత ముఖ్యమో ఆ మూవీ మరోసారి చాటి చెప్పింది.
అయితే గార్గి తర్వాత అదే స్థాయిలో పూర్తిగా ఆమె భుజాలపై నడిచే లేడీ ఓరియంటెడ్ మూవీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో అభిమానులు మరో పవర్ ఫుల్ పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు. సాయి పల్లవి కూడా రోల్ కు బలం, కథకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలనే ఎంపిక చేస్తుండటంతో అలాంటి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
మరోవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేయడంలోనూ ఆమె తనదైన విధానాన్ని కొనసాగిస్తున్నారు. కథలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే అంగీకరిస్తారనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. అందుకే ఆమె నటించిన చాలా చిత్రాల్లో హీరోయిన్ పాత్ర కూడా కథను ముందుకు నడిపించేలా ఉంటుంది. ఇదే ఆమె కెరీర్ ను ఇతర హీరోయిన్లతో పోలిస్తే భిన్నంగా నిలబెడుతోంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి.
అందులో రామాయణం వంటి భారీ చిత్రం ఒకటి. ఆ సినిమా తర్వాత ఆమె ఎలాంటి కథలను ఎంపిక చేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా మరోసారి గార్గి తరహా బలమైన మహిళా ప్రధాన పాత్రలో ఆమెను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే త్వరలో జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా స్టార్ హీరోలతో సినిమాలు చేసినా, సోలోగా కథను మోసే పాత్రల్లో కనిపించినా ఒకే స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడం ఆమె ప్రత్యేకత. అందుకే సాయి పల్లవి నుంచి వచ్చే ప్రతి కొత్త సినిమా కంటే, ఎంచుకునే కొత్త పాత్రపై సినీ ప్రియుల్లో ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.
