ఇప్పట్లో ఆ ఆలోచన లేదన్న సాయి పల్లవి..!
లేడీ పవర్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచింది.
By: Ramesh Palla | 28 March 2026 11:54 AM ISTలేడీ పవర్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా హీరోయిన్ అనగానే స్కిన్ షో, గ్లామర్ పాత్రలు గుర్తుకు వస్తాయి. కానీ సాయి పల్లవి కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు స్కిన్ షో కి దూరంగా ఉంటూ వచ్చింది. గ్లామర్ పాత్రలు చేయకుండా చాలా క్లీన్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుత కాలంలో ఇలాంటి హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా సాయి పల్లవి వంటి హీరోయిన్ మరెవ్వరూ లేరు అనేది ఆమె అభిమానుల మాట. ఇంత క్లీన్ ఇమేజ్ ఉంది కనుకే ఈమెకు రామాయణంలో సీత పాత్రలో నటించే అవకాశం దక్కింది అనేది చాలా మంది మాట. ఆ విషయం పక్కన పెడితే సాయి పల్లవి పెళ్లి గురించి ఇటీవల ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతోందంటూ వచ్చిన వార్తలు ఆమె ఫ్యాన్స్‌లో చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా సాయి పల్లవి పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
పెళ్లి వార్తలపై సాయి పల్లవి క్లారిటీ...
సాయి పల్లవి పెళ్లి గురించి పదే పదే వార్తలు రావడానికి ప్రధాన కారణం ఆమె చెల్లి ఇప్పటికే పెళ్లి చేసుకుంది. సాయి పల్లవి చెల్లి పెళ్లి అయింది, కానీ ఇప్పటివరకు సాయి పల్లవి పెళ్లి కాలేదు, అందుకే ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి విషయమై ఒత్తిడి చేస్తున్నారని, అందుకే పెళ్లికి సిద్ధం అయిందనే వార్తలు వచ్చాయి. వ్యాపారవేత్త తో పెళ్లికి ఏర్పాట్లు అంటూ కూడా పుకార్లు షికార్లు చేశాయి. దాంతో సాయి పల్లవి సన్నిహితులు అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా సాయి పల్లవి పెళ్లి విషయంలో పుకార్లు ఆగడం లేదు. ఎట్టకేలకు ఆమె నుంచి స్పందన రావడంతో మీడియాలో వార్తలకు చెక్ పడ్డట్లు అయింది. తాజాగా సాయి పల్లవి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా అవన్నీ వట్టి పుకార్లే అని చెప్పుకొచ్చింది.
పుకార్లకు చెక్ పెట్టే విధంగా....
ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని పేర్కొంది. ప్రస్తుతం సాయి పల్లవి వయస్సు 33 ఏళ్లు మాత్రమే. ఆమె కంటే వయసులో చాలా పెద్ద వారు, ఇండస్ట్రీలో సీనియర్‌లు ఉన్నారు. అయినా కూడా సాయి పల్లవి పెళ్లి గురించి ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు అంటూ ఆమెను అభిమానించే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి. ఇప్పటికే సాయి పల్లవి హీరోయిన్‌గా చాలా బిజీగా ఉంది. ఆమె ఓకే చెప్పాలే కానీ రాబోయే నాలుగు అయిదు ఏళ్లకు సరిపడా సినిమాలతో క్యాలెండర్ ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే సాయి పల్లవి ఇప్పట్లో సినిమాలను మానేసి పెళ్లి పీటలు ఎక్కుతుంది అని ఆమె అభిమానులు భావించడం లేదు. కనుక ఆమె పెళ్లి వార్తలను ఆపేస్తే బెటర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.
రామాయణంలో సీతగా సాయి పల్లవి...
రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి నటిస్తున్న విషయం తెల్సిందే. సీత పాత్రలో సాయి పల్లవి ని ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అని అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సీత పాత్రకు సాయి పల్లవి ని మించిన ఎంపిక మరొకరు ఉండరు అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు రామాయణంలో నటిస్తూనే మరోవైపు సాయి పల్లవి వరుసగా విజయ్ సేతుపతితో ఒక సినిమా, ఏక్ దిన్ అనే హిందీ సినిమాలోనూ నటిస్తోంది. అవే కాకుండా తెలుగు, తమిళ్, హిందీలో మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె హీరోయిన్‌గా ఇంత బిజీగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి కొత్తగా రాబోతున్న ఎంతో మంది హీరోయిన్స్‌కి సాయి పల్లవి ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
