Begin typing your search above and press return to search.

సాయి పల్లవి సరికొత్త యాక్షన్ అవతారం!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `D5` చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   10 Jun 2026 1:00 AM IST
సాయి పల్లవి సరికొత్త యాక్షన్ అవతారం!
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో.. సహజసిద్ధమైన హావభావాలతో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను అన‌తి కాలంలోనే ద‌క్కించుకున్నారు. అయితే ఇంత‌వ‌ర‌కూ సాయి ప‌ల్ల‌వి ట‌చ్ చేయ‌ని జోన‌ర్ అంటూ ఒక‌టి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషించిన ప‌ల్ల‌వి మాత్రం స‌రైన మాస్ రోల్ మాత్రం పోషించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తొలిసారి పక్కా మాస్ యాక్షన్ రోల్‌లో అల‌రించ‌డానికి అమ్మ‌డు రెడీ అవుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `D5` చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అమ్మ‌డు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తుండటం విశేషం. ఖాకీ దుస్తులు ధరించి చట్టాన్ని రక్షించే పటిష్టమైన పాత్ర‌లో వెండితెరపై కనిపిం చంబోతుంది. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ చేసిన సాయి పల్లవి నుండి ఇలాంటి ఒక రౌద్రరూపాన్ని ఎవరూ ఊహించలేదు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఇటీవల `అమరన్` చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్నారు.

ఆయన సినిమాల్లో పాత్రల రూపకల్పన ఎంతో సహజంగా.. సమాంతరంగా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే D5 చిత్రంలో సాయి పల్లవి పాత్రను సాధారణ హీరోయిన్‌గా కాకుండా.. కథను మలుపు తిప్పే బలమైన యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పోలీస్ పాత్రకు న్యాయం చేయడం కోసం సాయి పల్లవి ఎక్కడా తగ్గడం లేదు. ఇందులో ఉండే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్- ఫైట్ సీన్స్ కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ .. ఫిజికల్ ట్రైనింగ్ కూడా ప్రారంభించింది. నృత్యంలో సాయిప‌ల్ల‌వికున్న ఫ్లెక్సిబిలిటీ .. టైమింగ్ ఈ యాక్షన్ స్టంట్స్ చేయడంలో ఆమెకు ఎంతో ప్లస్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది.

డూప్స్ లేకుండా రియలిస్టిక్ యాక్షన్ సీన్స్ చేయడానికి ప‌ల్ల‌వి మొగ్గు చూపుతుండటం విశేషం. ధనుష్- సాయి పల్లవి కాంబినేషన్‌కు సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఇద్ద‌రి కలయికలో రిలీజ్ అయిన `మారి 2` చిత్రంలోని రౌడీ బేబీ పాట సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆ సినిమాలో ఇద్ద‌రి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, ఎనర్జీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవ్వ‌డం..అదీ ఓ సీరియస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో కావడం సినిమాపై అంచనాలను స్కై ని తీసుకెళ్తున్నాయి.

ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా నటిగా తనను తాను నిరంతరం రీ-ఇన్వెంట్ చేసుకోవడానికి సాయి పల్లవి ప్రయత్నిస్తుంటుంద‌ని ఈ పాత్ర ఎంపిక మరోసారి నిరూపించింది. ఎమోషన్స్ మాత్రమే కాకుండా.. మాస్ యాక్షన్ సీన్లను కూడా తాను పండించగలనని నిరూపించుకోవడానికి ఇదొక సువర్ణావకాశం.