Begin typing your search above and press return to search.

'ఏక్ దిన్'కు నేను సూటవ్వలేదు-సాయిపల్లవి

కానీ బాలీవుడ్ అరంగేట్రంలో మాత్రం సాయిపల్లవికి చేదు అనుభవం తప్పలేదు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో కలిసి సాయిపల్లవి నటించిన ‘ఏక్ దిన్’ సినిమా ప్రేక్షకాదరణ పొందలేకపోతోంది.

By:  Garuda Media   |   7 May 2026 2:50 PM IST
ఏక్ దిన్కు నేను సూటవ్వలేదు-సాయిపల్లవి
X

దక్షిణాది సినిమాల్లో సాయిపల్లవి స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరో ఎవరైనా సరే.. కేవలం ఆమెను చూడ్డానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయిపల్లవి నటించే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది. కానీ బాలీవుడ్ అరంగేట్రంలో మాత్రం సాయిపల్లవికి చేదు అనుభవం తప్పలేదు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో కలిసి సాయిపల్లవి నటించిన ‘ఏక్ దిన్’ సినిమా ప్రేక్షకాదరణ పొందలేకపోతోంది.

విడుదలకు ముందు ఈ సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ దారుణంగా జరిగాయి. సినిమాకు టాక్ పర్వాలేదనిపించినా సరే.. జనం థియేటర్లకు రాలేదు. వీకెండ్లోనే ప్రభావం చూపలేకపోయిన ‘ఏక్ దిన్’.. ఆ తర్వాత మరింత డౌన్ అయింది. గత కొన్నేళ్లలో బాలీవుడ్లో వచ్చిన కాస్త పేరున్న చిత్రాల్లో ఇది అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఐతే ఇంకా ‘ఏక్ దిన్’ సినిమాను ప్రమోట్ చేస్తున్న సాయిపల్లవి.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర తాను చేయకుండా ఉండాల్సిందని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడడం గమనార్హం. నిజానికి తాను ఎక్కువగా సీరియస్ పాాత్రలు, వేదనకు గురయ్యే పాత్రలు చేసిన నేపథ్యంలో జాలీగా సాగే పాత్రలు చేయాలని ఎదురు చూస్తున్న సమయంలో.. మళ్లీ అలాంటి బాధ పెట్టే పాత్రే చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. కానీ ఈ కథ తనకు బాగా నచ్చడంతో సినిమా ఒప్పుకున్నానని.. ఇది మంచి సినిమా అవుతుందని అనుకున్నానని సాయిపల్లవి అభిప్రాయపడింది.

ఐతే ‘ఏక్ దిన్’ ప్రివ్యూ చూశాక మాత్రం ఈ పాత్రకు తాను సూట్ అవ్వలేదని అనిపించిందని, తన బదులు ఇంకో అమ్మాయి ఆ పాత్ర చేసి ఉంటే బాగుండేదని అనిపించిందని.. అదే విషయాన్ని చిత్ర నిర్మాత ఆమిర్ ఖాన్ దగ్గర కూడా చెప్పినట్లు సాయిపల్లవి వెల్లడించింది. కానీ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న జునైద్ మాత్రం సాయిపల్లవి తన పాత్రకు బాగా సూటైందని.. ఆమే ఈ పాత్రకు కరెక్ట్ అని అన్నాడు.