ఫ్యాన్ వార్స్ ను వాడుకున్నానంటోన్న డైరెక్టర్
లిటిల్ హార్ట్స్ మూవీతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి మార్తాండ్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 11 Sept 2025 3:35 PM ISTజీవితం ఎవరికి ఎటునుంచి అవకాశమిస్తుందో చెప్పలేం. వచ్చిన అవకాశాన్ని అందుకుని దాన్ని ఉపయోగించుకుని జీవితంలో ముందుకెళ్లిన వారే కాస్త లేటైనా సక్సెస్ అవుతారు. ఈ విషయాన్ని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాయి మార్తాండ్ మరోసారి నిరూపించారు. లిటిల్ హార్ట్స్ మూవీతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి మార్తాండ్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నారు.
మీమ్స్ క్రియేటర్ గా పాపులరైన సాయి మార్తాండ్
ఒక నార్మల్ స్టోరీకి ఫన్, ఎంటర్టైన్మెంట్ ను యాడ్ చేసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్. అయితే సినిమాల్లోకి రాక ముందు సాయి మార్తాండ్ మీమ్ క్రియేటర్ గా బాగా పాపులర్. మీమ్స్ క్రియేట్ చేయడంలో తనకున్న ఎక్స్‌పీరియెన్సే లిటిల్ హార్ట్స్ సినిమాకు బాగా ఉపయోగపడింది. సినిమాలోని ప్రతీ సీన్ లో ఫన్ ను క్రియేట్ చేయడంలో ఆ అనుభవమే హెల్ప్ అయిందని సాయి మార్తాండ్ ఓపెన్ గా చెప్పారు.
ఆ గ్రూపుల్లో నేనూ ఒకడిని!
సోషల్ మీడియాను అతను ఎంతో తెలివిగా వాడుకుంటూ, అతని క్రియేటివిటీకి పదును పెట్టడం ద్వారా సాయి మార్తాండ్‌కు ఇండస్ట్రీలోకి రావడానికి ఎంట్రీ దొరికింది. అంతే కాదు, తన కెరీర్ ను నిర్మించుకోవడానికి ఫ్యాన్ వార్స్ ను కూడా వాడుకున్నానని సాయి మార్తాండ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పొన్నియన్ సెల్వన్ రిలీజైన టైమ్ లో ఆ సినిమాకు తెలుగులో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్సే జరిగాయి. ఆ సమయంలో పొన్నియన్ సెల్వన్ కు మద్దతుగా కొందరు, విమర్శకులుగా ఇంకొందరు గ్రూపులుగా ఏర్పడగా తాను కూడా ఆ గ్రూపుల్లో ఒకడినని చెప్పుకొచ్చారు.
తాను పొన్నియన్ సెల్వన్ కంటే బాహుబలినే ఎక్కువ ఇష్టపడతానని చెప్పిన సాయి మార్తాండ్, ఆ ఫ్యాన్ వార్ యాక్టివిటీనే తనకు మూవీల్లోకి రావడానికి నెట్ వర్క్ పెరిగేలా చేసిందని చెప్పారు. ఓ సారి ట్విట్టర్ స్పేస్ లో ఓ నిర్మాణ సంస్థకు చెందిన మార్కెటింగ్ హెడ్ కూడా పాల్గొన్నారని, ఆ టీమ్ లోని ఒకరు అతని గురించి పాజిటివ్ గా మాట్లాడటం వల్ల తనకు ఆ నిర్మాతతో పరిచయం ఏర్పడి, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి దారి చూపిందని ఆయన చెప్పారు. తన జర్నీని మరింత మెమొరబుల్ గా మార్చడంతో పాటూ తాను ఇవాళ ఈ స్థాయికి చేరుకోవడంలో సోషల్ మీడియా భారీ పాత్ర పోషించిందని ఆయన చెప్తున్నారు. మీమ్స్ తో మొదలైన తన జర్నీ, ఇప్పుడు డైరెక్టర్ గా మారే వరకు వెళ్లిందని తెలిపారు సాయి మార్తాండ్.
