సాయి కుమార్‌కు డూప్‌గా కన్నడ సూపర్ స్టార్
ఆ సమయంలో నిర్మాత రాము గారు అక్కడ అందుబాటులో లేరు. కానీ దర్శకుడు మాత్రం షూటింగ్ కంటిన్యూ చేయాలని అనుకున్నారు.
By: M Prashanth | 31 Aug 2026 5:01 PM ISTకూర్మావతార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సీనియర్ నటుడు సాయి కుమార్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఉన్న శివన్న తన కోసం డూప్ గా ఎలా మారారో ఆయన మాటల్లోనే వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. సాయి కుమార్ తన అనుభవాన్ని ఈ విధంగా వివరించారు.
గతంలో మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాం. ఆ ప్రాజెక్టును ఒకేసారి డబుల్ వర్షన్ గా రెండు భాషల్లో తెరకెక్కించారు. కన్నడ భాషలో శివన్న హీరోగా నటించగా తెలుగు వర్షన్ కు వచ్చేసరికి నేను హీరోగా చేశాను. శివన్న ఎనర్జీని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అదే ఎనర్జీతో ఇద్దరం కలిసి ఆ షూటింగ్ పూర్తి చేస్తున్నాం. ఒక షాట్ తను చేస్తే మరో షాట్ నేను చేసేలా ఇద్దరం ఎంతో కష్టపడుతూ పని చేశాం.
మురుడేశ్వర్ లో ఆ సినిమాకు సంబంధించిన ఒక భారీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆ సన్నివేశం చేస్తున్నప్పుడు కొంచెం ఆవేశపడి నేను కింద పడిపోయాను. ఆ ప్రమాదంలో నా ముక్కుకు గట్టిగా దెబ్బ తగిలి రక్తం వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకుని మళ్లీ లొకేషన్ కు తిరిగి వచ్చాను. గాయంతో ఉన్న నన్ను అలా చూడగానే శివన్న ఎంతో కంగారు పడ్డారు.
ఆ సమయంలో నిర్మాత రాము గారు అక్కడ అందుబాటులో లేరు. కానీ దర్శకుడు మాత్రం షూటింగ్ కంటిన్యూ చేయాలని అనుకున్నారు. అప్పుడు మా సినిమాకు ఫైట్ మాస్టర్ గా రామ్ శెట్టి ఉన్నారు. మెయిన్ విలన్ గా చేస్తున్న ఆశిష్ విద్యార్థిని నేను కొట్టే ఒక ముఖ్యమైన అప్ షాట్ తీయాల్సి ఉంది. ఆ షాట్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని మాస్టర్ నాకు చెప్పారు.
కానీ నా ముఖానికి ఉన్న గాయం వల్ల నేను ఆ అప్ షాట్ చేయలేని పరిస్థితి నెలకొంది. నేను ఆ షాట్ చేయలేనని పైకి వచ్చి కేవలం లుక్ మాత్రమే ఇస్తానని డైరెక్టర్ తో చెప్పాను. అప్పుడు జరిగిన ఒక విషయం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆ పోలీస్ టార్చర్ సీన్ లో బట్టలు లేకుండా ఒకేలా ఉండటం అదృష్టంగా మారింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్న శివన్న ఆ ఒక్క షాట్ కోసం స్వయంగా నాకు డూప్ గా మారేందుకు ముందుకు వచ్చారు.
తన స్టార్ డమ్ ఏంటో పక్కన పెట్టి ఒక తోటి నటుడి కోసం ఆయన డూప్ గా మారడం శివన్న గొప్ప మనసుకు నిదర్శనం. ఆయన చేసిన ఆ చిన్న షాట్ కు థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుదర్శన్ థియేటర్ లో నేను మార్నింగ్ షో చూస్తున్నప్పుడు ఆ అప్ షాట్ రాగానే థియేటర్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆ షాట్ చేసింది నేను కాదు శివన్న అని ప్రేక్షకులకు ఏమాత్రం తెలియలేదు. ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది అని సాయి కుమార్ ఎమోషనల్ గా పంచుకున్నారు.
