పిల్లలతో ఓపెన్ రిలేషన్‌షిప్ ఉండాలి: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్
తాజా డిజిటల్ యుగంలో పిల్లలను రక్షించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
By: M Prashanth | 14 Sept 2025 1:12 AM ISTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన అభయం మసూం సమిట్ 2025 కార్యక్రమంలో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై అవగాహన పెంచే దిశగా చర్చలు జరిగాయి. ఈ సమిట్‌ను భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సంయుక్తంగా నిర్వహించగా, దేశవ్యాప్తంగా 70 నగరాల నుంచి యువ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
తాజా డిజిటల్ యుగంలో పిల్లలను రక్షించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చిన్నారులపై వస్తున్న అసభ్య కామెంట్లను చూస్తే చాలా బాధగా అనిపిస్తుందని తెలిపారు. “ఎవరూ దీనిపై స్పందించలేదు. అందుకే నేను ముందుకు వచ్చాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇతరులను దెబ్బతీయడానికి ఉపయోగపడకూడదు. డార్క్ కామెడీ పేరిట చిన్నారులను అవమానించడం సిగ్గుచేటు” అని తేజ్ స్పష్టం చేశారు.
సాయి ధరమ్ తేజ్ తన జీవితంలోని అనుభవాలను పంచుకున్నారు. “నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు నా ఫస్ట్ లవ్ స్టోరీని నా అమ్మతో పంచుకున్నాను. నన్ను ఏ విషయమైనా ఓపెన్‌గా చెప్పేలా ఫ్రీడమ్ ఇచ్చింది నా తల్లి. అలాంటి సంబంధమే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో నిర్మించుకోవాలి. పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపాలి. వారిని లవ్‌తో నేర్పించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలను ఇంట్లోనే కాదు, పాఠశాలలో కూడా బోధించాలి” అని తేజ్ వివరించారు.
సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి అని ఆయన అన్నారు. “ప్రతి వారం కనీసం ఒకసారి అయినా కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకోవాలి. పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అన్నది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్స్‌ని తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు లేదా ఆధార్ కార్డులతో లింక్ చేయాలి. కనీసం కొంత అకౌంటబిలిటీ ఉండాలి” అని ఆయన సూచించారు.
పిల్లల విద్య హక్కు గురించి కూడా తేజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2015లో ఆరుకు ప్రాంతంలో తింక్ పీస్ అనే సంస్థతో కలిసి పాఠశాల నిర్మాణంలో సహకరించానని, తెలంగాణలో కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారి చదువు ఖర్చులు భరించానని తెలిపారు. “ఒక మంచి సమాజం కోసం ప్రతి బిడ్డకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. మనం వారిని రియల్ వరల్డ్‌లో నిలబడేలా చేయాలి” అని ఆయన గుర్తుచేశారు.
అంతేకాదు, సినిమాల్లో కూడా చిన్నారులకు తప్పు సందేశం వెళ్లకుండా జాగ్రత్తపడతానని తేజ్ అన్నారు. “విన్నర్ సినిమా తర్వాత ఎవరికైనా టీజ్ చేసే పాటల్లో చేయకూడదని నిర్ణయించుకున్నాను. నిజమైన ప్రేమ అంటే ప్రశంసించాలి కానీ ఎగతాళి చేయకూడదు. నా మీద వస్తున్న ఫేక్ న్యూస్ గురించి కూడా స్పష్టత ఇస్తున్నాను. నా పెళ్లి గురించి రూమర్స్ పుట్టించవద్దు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను” అని చిరునవ్వుతో ముగించారు. మొత్తానికి, అభయం మసూం సమిట్ 2025 వేదికగా సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ ప్రసంగం అక్కడ ఉన్న వారిని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా తల్లిదండ్రులందరినీ ఆలోచింపజేసేలా నిలిచింది.
