Begin typing your search above and press return to search.

ఇక గ్యాప్ చాలు తేజు.. స్పీడ్ మీటర్ పెంచాల్సిందే!

గ్యాప్‌ కు గుడ్‌ బై చెప్పి.. ఇక వరుస సినిమాలతో సందడి చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి మెగా హీరో సాయి దుర్గ తేజ్‌ కు.

By:  M Prashanth   |   27 Sept 2026 12:00 AM IST
ఇక గ్యాప్ చాలు తేజు.. స్పీడ్ మీటర్ పెంచాల్సిందే!
X

గ్యాప్‌ కు గుడ్‌ బై చెప్పి.. ఇక వరుస సినిమాలతో సందడి చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి మెగా హీరో సాయి దుర్గ తేజ్‌ కు. బ్రో మూవీ తర్వాత చాలా కాలంగా సిల్వర్‌ స్క్రీన్‌ కు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సంబరాల ఏటిగట్టు మూవీతో పలకరించబోతున్నారు. ఆ సినిమా తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండటంతో.. ఇక తేజ్ స్పీడ్ మీటర్ పెంచితే అభిమానులకు పండగే!

సాయి దుర్గ తేజ్ కెరీర్‌ లో ఒకప్పుడు సినిమాల స్పీడ్ కనిపించింది. పిల్లా నువ్వు లేని జీవితంతో మొదలైన జర్నీలో.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్ ఇలా వరుస సినిమాలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఒక సినిమా విడుదలైన కొద్ది నెలలకే మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే 2021లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత ఆయన సినిమాల స్పీడ్ తగ్గింది.

కాస్త బ్రేక్ తర్వాత విరూపాక్షతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే పవన్ కల్యాణ్‌ తో కలిసి బ్రోలో నటించారు. 2023లో బ్రో విడుదలైన తర్వాత మాత్రం తేజ్ నుంచి మరో సినిమా రావడానికి చాలా టైమ్ పట్టింది. ఇప్పుడు ఆ వెయిటింగ్ కు ‘సంబరాల ఏటిగట్టుతో బ్రేక్ పడనుంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోంది.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో సాగే హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా దీన్ని భారీ రేంజ్ లో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్‌ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ సినిమా విషయంలో కూడా విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు మారింది. గతంలో దసరా సీజన్‌ లో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగినా.. అది జరగలేదు. 2027 సంక్రాంతి బరిలోకి తీసుకొస్తున్నట్లు, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

అయితే ఈసారి రిలీజ్ విషయంలోఎలాంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిర్మాత చైతన్య రెడ్డి చెబుతున్నారు. సంబరాల ఏటిగట్టు సంక్రాంతికి కచ్చితంగా వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దీంతో సంక్రాంతి రిలీజ్‌ పై మూవీ టీమ్ కాన్ఫిడెంట్‌ గా ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇక తేజ్ తర్వాతి సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ పెరుగుతోంది. పార్వేట అనే ప్రాజెక్ట్ ఆయన లైనప్‌ లో ఉంది. సుజిత్, సందీప్ కాంబినేషన్‌ లో మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వీటితో పాటు మరికొందరు యువ దర్శకులతోనూ తేజ్ కథలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంటే.. ఇప్పుడు తేజ్ ముందు ఉన్న అసలు టార్గెట్ ఒక్కటే. సంబరాల ఏటిగట్టును పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావడం, ఆ తర్వాత వరుస సినిమాలను పట్టాలెక్కించడం. ఇప్పటికే వచ్చిన గ్యాప్‌ కు అభిమానులు ఫుల్‌ స్టాప్ కోరుకుంటున్నారు. ఇకపై సినిమాల మధ్య ఇంత పెద్ద బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు వస్తే.. సాయి తేజ్ కెరీర్‌ లో మళ్లీ స్పీడ్ కనిపించే అవకాశం ఉంటుంది.