ప్రేమ పిల్లా? పెద్దల చూసిన పిల్లా!
ఎట్టకేలకు మెగా మేనల్లుడు సాయితేజ్ నుంచి పెళ్లి విషయమై అధికారిక ప్రకటన కొన్ని గంటల క్రితమే వచ్చేసింది.
By: Srikanth Kontham | 17 Nov 2025 6:00 PM ISTఎట్టకేలకు మెగా మేనల్లుడు సాయితేజ్ నుంచి పెళ్లి విషయమై అధికారిక ప్రకటన కొన్ని గంటల క్రితమే వచ్చేసింది. కొత్త ఏడాదిలో ధాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించాడు. పెళ్లి వార్త కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. తోటి హీరోలంతా ఓ ఇంటి వారు అవుతున్నా? సాయితేజ్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు ? ఏంటి? అనే చర్చ నిరంతరం జరిగేది. ఇప్పుడా చర్చకు తావు లేకుండా శాశ్వతంగా పుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు. అయితే పెళ్లి కూతురు ఎవరు? అన్నది మాత్రం సాయితేజ్ గోప్యంగానే ఉంచాడు.
రెండు నెలల క్రితమే వెలుగులోకి:
తాను మనువాడే అమ్మాయి ఎవరో తెలియకుండా ముందే ప్రకటన చేయడుగా? అన్ని ఒకే అయిన తర్వాత విషయం వెల్లడించాడు. కానీ వధువు విషయంలో ఇంత గోప్యత దేనికో. మరి సాయితేజ్ ది ప్రేమ వివాహమా? పెద్దల కుద ర్చిన పెళ్లా? అంటే దాని గురించి కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే సాయితేజ్ పెళ్లి విషయంలో రెండు నెలల క్రితమే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. కొత్త ఏడాది లో పెళ్లి చేసుకుంటాడని..ఆ సంబంధం పెద్దలు చూసిన అమ్మాయని నెట్టింట ప్రచారంలోకి వచ్చింది. తమ కుటుంబానికి బాగా తెలిసిన అమ్మాయి అని.. విదేశాల్లో ఉద్యోగం చేస్తోందని వినిపించింది.
ఇకపై పిల్ల ఎవరన్నదే ప్రధాన చర్చ:
ఈ నేపథ్యంలో అప్పటి ప్రచారాన్నే సాయితేజ్ నిజం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ వివాహం కూడా అన్నయ్య పెళ్లితో పాటే, జరుగుతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా సాయితేజ్ ప్రకటనతో తన పెళ్లి అయితే ఖరారైనట్లు క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇకపై పిల్ల ఎవరు? అన్న చర్చ ప్రధాన చర్చగా మారుతుంది. ఈ పెళ్లి విషయంలో కూడా చిరంజీవి చొరవ తీసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. తొలి నుంచి మేనల్లుళ్ల విషయంలో చిరునే బాధ్యతలు తీసుకున్నారు.
మేన మామలదే బాధ్యత:
ఇద్దరు నటులు అవ్వడానికి కారణం చిరంజీవే. స్వయానా మేనల్లుళ్లు కావడంతో వారి అవసరాలు తానే చూసారు. వారితో పాటు, అడపా దడపా నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు పెళ్లి వ్యవహారాలు కూడా వారే చక్కబెడతారని తెలుస్తోంది. అలాగే మెగా కుటుంబంలో వరుణ్ తేజ్ మినహా వివాహాలన్నీ సినిమా వాళ్లతో సంబంధం లేనివే. రామ్ చరణ్ వ్యాపారవేత్త ఉపాసనను పెళ్లి చేసుకోగా, చిరంజీవి ఇద్దరు కుమార్తెలు పెళ్లిళ్లు జరిగినవి ఇతర రంగాల వారితోనే. వరుణ్ తేజ్ మాత్రం నటి లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
