Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడి ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించే రోజు

ఈ చిత్రాన్ని గతంలో డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా నాణ్యత విషయంలో ఎక్కడా తగ్గకూడదనే ఉద్దేశంతో సంక్రాంతి బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   11 Aug 2026 3:06 PM IST
మెగా మేనల్లుడి ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించే రోజు
X

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సినిమా రాక కోసం చాలా కాలంగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా `సంబరాల ఏటిగట్టు` ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి.. ఆ తర్వాత వచ్చిన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ చిత్ర యూనిట్ విడుదల తేదీకి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్‌తో ముందుకు రానుంద‌ని స‌మాచారం.

ఈ చిత్రాన్ని గతంలో డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా నాణ్యత విషయంలో ఎక్కడా తగ్గకూడదనే ఉద్దేశంతో సంక్రాంతి బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. `హనుమాన్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ (నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌) చిత్రం జనవరి 12న విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ.. `సంబరాల ఏటిగట్టు` చిత్రాన్ని కూడా 12 జనవరి 2027న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

రోహిత్ కేపీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత కే నిరంజన్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ విజువల్ వండర్ ఇప్పటికే అన్నివ‌ర్గాల్లోను భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెర‌కెక్కిన‌ ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. పెట్టిన పెట్టుబడికి తగిన రీతిలో భారీ రిటర్నులను రాబట్టడానికి సరైన విడుదల తేదీ చాలా అవసరం. అందుకే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని ఖ‌రారు చేసుకోవడానికి .. కలెక్షన్ల సునామీ సృష్టించడానికి పండగ సెలవులే ఉత్తమమైన మార్గమని భావించిన నిర్మాతలు, సంక్రాంతి సీజన్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవడానికి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఈ సినిమా నిలవడం వసూళ్ల పరంగా పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

కథాంశం విషయానికి వస్తే.. `సంబరాల ఏటిగట్టు` కేవలం ఒక ప్యూర్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. పీరియాడిక్ నెపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. గ్రామీణ నేపధ్యంలో సంస్కృతి, సంప్రదాయాలు, పగ ప్రతీకారాల చుట్టూ తిరిగే ఈ కథలో సాయిధరమ్ తేజ్ నటన.. అత‌డి ఊరమాస్ లుక్ సరికొత్తగా ఉండబోతున్నాయి. ఇదివరకు ఎన్నడూ చూడని విభిన్నమైన క్యారెక్టరైజేషన్‌లో సాయిధరమ్ తన మాస్ పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లను ఉర్రూతలూగించడం ఖాయమని స్పష్టమవుతోంది.