ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో: సాయి తేజ్
ఈ రెండో జీవితంలోనే అతడు `బ్రో` చిత్రం నిరాశపరిచినా పునఃప్రవేశంలో ఎనర్జీతో అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత `విరూపాక్ష` లాంటి థ్రిల్లర్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
By: Sivaji Kontham | 14 Nov 2025 9:16 AM ISTమెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో మెగా కుటుంబం నుంచి అరడజను పైగా హీరోలు సినీరంగంలో అడుగుపెట్టి, నటనలో అజేయంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు. ఇప్పటికే సాయి తేజ్ కెరీర్‌లో పలు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ కేబుల్ బ్రిడ్జిపై బైక్ యాక్సిడెంట్ తర్వాత అతడు తన సెకండ్ లైఫ్ ని లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పెద్ద ప్రమాదం తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పట్టినా, సాయి తేజ్ పూర్తిగా కోలుకుని సినిమాల్లో నటిస్తున్నాడు.
ఈ రెండో జీవితంలోనే అతడు `బ్రో` చిత్రం నిరాశపరిచినా పునఃప్రవేశంలో ఎనర్జీతో అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత `విరూపాక్ష` లాంటి థ్రిల్లర్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం `హనుమాన్` నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో కేపీ రోహిత్ దర్శకత్వంలో `సంబరాల ఏటిగట్టు` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. జగపతిబాబు, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల సాయి తేజ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ గ్లింప్స్ ఆకట్టుకుంది. సాయి తేజ్ ఈ చిత్రంలో బాలీ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి తేజ ఈ చిత్రంలో మాస్ లుక్ తో యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ డైలాగ్ లు, యాక్షన్ సన్నివేశాల్లో హై ఎనర్జీతో అతడు ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాడు.
ఓవైపు సినిమా షూటింగులో బిజీగా ఉన్న సాయి తేజ్ ని ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అవార్డ్ వరించింది. గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ -2025 పేరుతో పురస్కారాన్ని రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సమక్షంలో తన తల్లి గారైన శ్రీమతి దుర్గ చేతులమీదుగా అందుకున్నాడు. ఇది యాక్సిడెంట్ తర్వాత అతడికి రెండో లైఫ్‌లో మొదటి అవార్డ్. ఈ ఫోటోతో పాటు ఇప్పుడు సాయి తేజ్ మొదటి లైఫ్ లో మొదటి అవార్డ్ అందుకున్న వేరొక ఫోటో కూడా వైరల్ అవుతోంది. సహజనటి జయసుధ, అల్లు అరవింద్ సమక్షంలో సాయి ధరమ్ తేజ్ కొన్నేళ్ల క్రితం కెరీర్ మొదటి పురస్కారాన్ని తన తల్లి గారైన శ్రీమతి విజయదుర్గ చేతులమీదుగా అందుకున్నాడు. ఈ రెండు ఫోటోలను ఇప్పుడు అభిమానులు వైరల్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ''నా మొదటి జీవితంలో నా మొదటి అవార్డ్ అమ్మ దే.. ఇప్పుడు నా రెండవ జీవితంలో నా మొదటి పురస్కారం అమ్మ దే!'' అంటూ వ్యాఖ్యానించాడు. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలీదు నీకు కొడుకు గా పుట్టాను అమ్మా! అంటూ యువహీరో సాయి తేజ్ ఎమోషనల్ అయ్యాడు.
సాయి తేజ్ సెకండ్ లైఫ్ లో నెమ్మదిగా ఒక్కో సినిమా పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నాడు. బ్రో, విరూపాక్ష తర్వాత పూర్తిగా `సంబరాల ఏటిగట్టు` కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తదుపరి చిత్రంపై దృష్టి సారిస్తాడు. ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిటై, అనవసర స్ట్రెస్ తీసుకునేందుకు మెగా మేనల్లుడు సిద్ధంగా లేడని తాజా ప్రణాళికలు చెబుతున్నాయి.
