వారికి సాక్ష్యాలతో సమాధానం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్
ఈ సమయంలోనే కొందరు సాయి ధరమ్ తేజ్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
By: Ramesh Palla | 24 Sept 2026 5:52 PM ISTసాయి ధరమ్ తేజ్ అయిదు ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయ పడ్డ విషయం తెల్సిందే. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకుని ఉండటం వల్ల ప్రాణాలతో బయట పడ్డాడు. ఆ విషయాన్ని స్వయంగా సాయి ధరమ్ తేజ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. పదే పదే ఆ విషయాన్ని చెప్పడం ద్వారా ఎంతో మంది హెల్మెట్ పెట్టుకునేలా సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేస్తున్నాడు. తాజాగా మరోసారి సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా అవగాహణ పోస్ట్ చేశాడు. సరిగ్గా అయిదు ఏళ్ల క్రితం నాకు పునర్జన్మ దక్కింది. అందుకే నేడు తనకు పునర్జన్మ దినం అంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో కచ్చితంగా ప్రతిఒక్కరు బైక్ పై వెళ్లే సమయంలో హెల్మెట్ పెట్టుకుని ప్రాణాపాయం నుంచి బయట పడాలి అంటూ అవగాహన కల్పిస్తూ అందరి అభినందనలు అందుకున్నాడు.
సాయి ధరమ్ తేజ్‌పై నెగిటివ్ కామెంట్స్...
ఈ సమయంలోనే కొందరు సాయి ధరమ్ తేజ్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కి గురి అయిన సమయంలో మొదట చూసి కాపాడిన వ్యక్తి అబ్దుల్ ఫర్హాన్. కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన వెంటనే అబ్దుల్ స్పందించాడు. అతడే పక్కన కూర్చోబెట్టి, స్నేహితుడి సహాయంతో సపర్యలు చేశాడు. ఆ విషయాన్ని స్వయంగా అబ్దుల్ పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ చెప్పాడు. తనకు సాయం చేసిన అబ్దుల్‌కి సాయి ధరమ్ తేజ్ కృతజ్ఞతలు చెప్పాడు. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ నుంచి ఆయనకు పెద్ద ఎత్తున సాయం అందింది అంటూ వార్తలు వచ్చాయి. సాయం గురించి ఎవరికి తోచిన విధంగా వారు మీడియాలో కథనాలు రాశారు. అయితే అతడికి ఏ మేరకు సహాయం అందింది అనే విషయంలో మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ రాలేదు.
మెగా ఫ్యామిలీకి...
యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్నాళ్లకు అబ్దుల్ ఒక మీడియాతో మాట్లాడుతూ తనకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సాయం అందలేదని, పైగా తనకు ఉన్న జాబ్ కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోను ఇప్పుడు కొందరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ మెగా ఫ్యామిలీని విమర్శిస్తున్నాడు. పునర్జన్మ దినం అంటూ సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తన యాక్సిడెంట్‌కు సంబంధించిన విషయాన్ని గుర్తు చేసుకున్న పోస్ట్‌కి కొందరు పబ్లిసిటీ కోసం ఇదంతా, నీకు ఆ రోజు సాయం చేసిన వారిని మరచి పోయావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో సాయి ధరమ్ తేజ్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. నిఖిల్ అనే వ్యక్తి దారుణంగా సాయి ధరమ్ తేజ్‌ను విమర్శిస్తూ పోస్ట్ చేయడంతో క్లారిటీ ఇచ్చేందుకు ఏకంగా ఫోటో సాక్ష్యాలను సైతం అదే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి వారికి సమాధానం ఇచ్చాడు.
సోషల్ మీడియాలో వీడియోతో సమాధానం...
నిఖిల్ అనే సోషల్ మీడియా వ్యక్తిని ట్యాగ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశాడు. తాను అబ్దుల్‌కి ఎప్పుడో ఆర్థిక సాయం చేశాను. అంతే కాకుండా ఆయన కుటుంబాన్ని సత్కరించాను. ఆయన ప్రస్తుతం జాబ్ చేసుకుంటూ తన జీవితం తాను బతుకుతున్నాడు. మళ్లీ ఈ గందరగోళం లోకి రావాలి అనుకోలేదు. అందుకే ఆయన పేరు ప్రస్తావించలేదు. అంతే తప్ప ఆయనపై నాకు గౌరవం లేదని కాదు. ఆయన మాత్రమే కాకుండా తాను ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరైతే నా కోసం ప్రార్థించారో వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశాను. తాను ఆసుపత్రి నుంచి వచ్చిన వెంటనే విడుదల చేసిన వీడియోలో హెల్ప్ చేసిన వారిని ప్రస్థావించాను అని కూడా సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. సాయి ధరమ్ తేజ్ సమాధానంతో నిఖిల్ అనే నెటిజన్ పాత వీడియోను తాను షేర్ చేశాను అని, నిజంగా మీరు ఆయనకు, ఆయన కుటుంబానికి హెల్ప్ చేసినట్లు అయితే అందరికీ సంతోషం. మీ రాబోయే సినిమాలకు ప్రాజెక్ట్‌లకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేయడంతో వివాదం సర్దుమనిగినట్లు అయింది. సాయి ధరమ్ సమాధానంతో ఇకపై ఏ ఒక్కరు అబ్దుల్ గురించి మాట్లాడే అవకాశం లేదు.
