ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!
‘ఇట్లు అర్జున’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న అనీష్ ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. నిర్మాణం, ప్రమోషన్ల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నాగార్జున, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లు ప్రచారానికి మద్దతు ఇవ్వడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ కొత్త హీరో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.
By: Priya Chowdhary Nuthalapti | 12 Nov 2026 9:45 PM ISTతెలుగు ప్రేక్షకులకు చాలామందికి తెలియని ఒక హీరో ఇప్పుడు ఏకంగా 40 కోట్ల సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదే విషయం ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం ఒక ఎత్తయితే.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం మరో ఎత్తు. సాధారణంగా కొత్త హీరోలు తమ మొదటి సినిమాను తక్కువ బడ్జెట్తో తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నిర్మాతలు కూడా పెద్దగా రిస్క్ చేయడానికి ఇష్టపడరు.
కానీ ఓ యువ హీరో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏకంగా రూ.40 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఆ యువ హీరో మరెవరో కాదు అనీష్. 'ఇట్లు అర్జున' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సాధారణంగా కొత్త హీరోల సినిమాలు చిన్న బడ్జెట్తో రూపొందుతుంటాయి. కానీ ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణంతో పాటు ప్రచార ఖర్చులను కలిపి దాదాపు రూ.40 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం చిన్న విషయం అయితే మాత్రం కాదు.
గతంలో కూడా కొంతమంది స్టార్ హీరోల వారసులు భారీ బడ్జెట్ సినిమాలతోనే వెండితెరకు పరిచయమయ్యారు. అక్కినేని అఖిల్ నటించిన తొలి చిత్రం 'అఖిల్' కోసం 50 కోట్లు ఖర్చు అవ్వగా.. ఆ తర్వాత కొంతమంది హీరోల సినిమాలకు 30 నుంచి 40 కోట్ల వరకు ఖర్చయింది. ప్రస్తుతం వరకు ఇవే తొలి హీరోల సినిమాలకు ఉన్న హైయెస్ట్ బడ్జెట్. ఇప్పుడు ఇదే దిష్టిలో అనీష్ కూడా చేరిపోయారు.
ఈ సినిమాకు అనీష్ తండ్రి మహేష్ రెడ్డి ప్రధాన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల కూడా ఈ ప్రాజెక్టులో సహ నిర్మాతగా భాగమయ్యారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు టాలీవుడ్లోని ప్రముఖ హీరోల నుంచి కూడా ప్రచార పరంగా మద్దతు లభించింది. నాగార్జున, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమా ప్రమోషన్లకు సహకరించడం ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది.
కానీ 40 కోట్లు సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. టైర్ 2 ఈరోజు సినిమాలు కూడా పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంటేనే 50 కోట్ల మార్కు అందుకుంటూ ఉంటాయి. అలాంటిది ఒక కొత్త హీరో సినిమా ఏకంగా 40 కోట్ల పైన రాబట్టాలి అంటే ఆ చిత్రంకి విపరీతమైన పాజిటివ్ టాక్ రాక తప్పదు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాలి అంటే.. రేపటి వరకు వేచి చూడాల్సిందే.
