సాయి అభ్యంకర్.. వరుస హిట్స్ పడితే వారికి షాకే..
ప్రైవేట్ ఆల్బమ్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ టాలెంట్ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారడం విశేషం.
By: M Prashanth | 30 Jan 2026 11:00 PM ISTకోలీవుడ్ లో కొత్త మ్యూజిక్ సెన్సేషన్ గా దూసుకొస్తున్న యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పేరు ప్రస్తుతం దక్షిణాది సినీ వర్గాల్లో మార్మోగుతోంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే వరుసగా భారీ ప్రాజెక్టులు అందిపుచ్చుకుంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ టాలెంట్ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారడం విశేషం.
ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమాతో సాయి అభ్యంకర్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ సినిమాలోని పాటలు మ్యూజికల్ హిట్ కావడంతో మేకర్స్ దృష్టి అంతా అతడిపైనే పడింది. నిజానికి ఫస్ట్ సినిమా బెంజ్ ఇంకా విడుదల కాకముందే, వరుస అవకాశాలు అతడి తలుపు తట్టడం సాయి అభ్యంకర్ టాలెంట్ కు నిదర్శనమనే చెప్పాలి.
ప్రస్తుతం సాయి అభ్యంకర్ లైనప్ చూస్తే ఏ స్టార్ కంపోజర్ కైనా షాక్ తగలాల్సిందే. సూర్య నటిస్తున్న కరుప్పు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కే మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆ మూవీ సాయికి కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కూడా సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇది అతడికి తెలుగులో భారీ ఎంట్రీగా మారబోతోంది. ఆ ప్రాజెక్ట్ హిట్ అయితే టాలీవుడ్ లోనూ అతడి డిమాండ్ పెరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో కార్తీ నటిస్తున్న మార్షల్ సినిమాకూ అతడే సంగీత దర్శకుడు.
మరోవైపు ధనుష్ 55వ సినిమాకు కూడా సాయి అభ్యంకర్‌ను అధికారికంగా ఎంపిక చేశారు. అమరన్ ఫేం రాజ్‌కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుంది. స్టార్ హీరోల సినిమాలకు వరుసగా సైన్ అవ్వడం సాయి క్రేజ్ ను మరింత పెంచుతోంది. శివకార్తికేయన్ తదుపరి ప్రాజెక్ట్ కు కూడా అతడి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇలా ఒకేసారి అరడజన్ కు పైగా చిత్రాలు సాయి చేతిలో ఉండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్, అనిరుధ్ వంటి స్టార్ కంపోజర్లు ఆధిపత్యం చెలాయించిన కోలీవుడ్ లో ఇప్పుడు సాయి అభ్యంకర్ కొత్త ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. అతడు అందిస్తున్న ట్యూన్స్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. మెలోడీ, మాస్ బీట్స్ రెండింటినీ సమానంగా హ్యాండిల్ చేయగలగడం అతడి ప్రత్యేకతగా మారింది.
మొత్తంగా చూస్తే, వరుసగా వస్తున్న భారీ అవకాశాలు మ్యూజికల్ హిట్స్ గా మారితే సాయి అభ్యంకర్ త్వరలోనే భారతీయ సినీ పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్ట ర్‌గా ఎదగడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. యువ సెన్సేషన్ దూకుడు చూస్తుంటే స్టార్ కంపోజర్లకు నిజంగానే గట్టి షాక్ ఇవ్వనున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
