Begin typing your search above and press return to search.

సాయి అభ్యంకర్‌.. అప్పుడే తేల్చేస్తారా!

ధనుష్ ‘O.M’లో పాటలు ఆకట్టుకున్నా, బీజీఎంపై మిశ్రమ స్పందన వచ్చింది. అనిరుధ్‌తో పోల్చి సాయిని విమర్శించడం తొందరపాటేనని, మరింత సమయం ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’తో సాయి తన సత్తా చాటుతాడా అనేది ఆసక్తికరం.

By:  M Prashanth   |   24 Nov 2026 12:03 PM IST
సాయి అభ్యంకర్‌.. అప్పుడే తేల్చేస్తారా!
X

సాయి అభ్యంకర్‌కు పెద్ద సినిమాల ఛాన్సులు రావడం మొదలైనప్పటి నుంచి అతని మీద అంచనాలు బాగా పెరిగాయి. ఇండిపెండెంట్ సాంగ్స్‌తో యూత్‌ను ఆకట్టుకున్న కుర్రాడు, స్టార్ హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ ఇస్తున్నారు. అయితే ధనుష్ 'O.M' రిలీజ్ తర్వాత కొన్ని కామెంట్స్ అతన్ని వెంటాడుతున్నాయి. పాటలు బాగున్నా బీజీఎం దగ్గర తడబడ్డారని ఒక వర్గం అంటోంది. ఇంత తొందరగా అతని టాలెంట్ మీద తీర్పు ఇచ్చేయడం మాత్రం కాస్త ఎక్కువే అనిపిస్తోంది.

O.Mలో సాయి కంపోజ్ చేసిన పాటలకు ముందే మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత కూడా మొదటి పాట గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. కానీ క్లైమాక్స్‌తో పాటు కొన్ని కీలక సీన్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆశించిన ఇంపాక్ట్ ఇవ్వలేదనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో బీజీఎం బాగుందని మెచ్చుకున్న రివ్యూలూ ఉన్నాయి. అందరి అభిప్రాయం ఒకేలా లేనప్పుడు ఒక్క సినిమా పట్టుకుని సాయిని తక్కువ చేయడం తొందరపాటే.

ఇక్కడ అనిరుధ్‌తో పోలిక తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. విక్రమ్, జైలర్, దేవర లాంటి సినిమాల్లో అనిరుధ్ బీజీఎం ఎంత బాగా వర్కౌట్ అయిందో చూశాం. కానీ ఆ స్థాయికి రావడానికి అతనికి కూడా టైమ్ పట్టింది. కెరీర్ మొదట్లో అనిరుధ్ చేసిన ప్రతి సినిమాకు ఒకే రేంజ్ రెస్పాన్స్ రాలేదు. రెహమాన్ లాంటి పెద్ద సంగీత దర్శకుడి మ్యూజిక్‌పైనా ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడిప్పుడే పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న సాయికి కొంత టైమ్ ఇవ్వాల్సిందే.

పైగా బీజీఎం మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరి చేతుల్లో ఉండదు. ఏ సీన్‌కు ఎంత మ్యూజిక్ కావాలి, ఎక్కడ సైలెన్స్ ఉంచాలి, ఏ ఎమోషన్‌ను హైలైట్ చేయాలి అనేది దర్శకుడితో కలిసి నిర్ణయించుకోవాలి. మంచి ట్యూన్ ఉన్నా దాన్ని సీన్‌కు సరిగ్గా సెట్ చేయకపోతే ఆశించిన ఎఫెక్ట్ రాదు. అందుకే ఈ విషయంలో డైరెక్టర్ పాత్ర కూడా ఉంటుంది. సాయి ఇంకా ఈ అనుభవాన్ని సంపాదించుకునే దశలోనే ఉన్నారు.

అయినా ఇంత చిన్న వయసులో పెద్ద హీరోల సినిమాలు దక్కడం మామూలు విషయం కాదు. 'కచ్చి సెరా', 'ఆస కూడ' పాటలతో తనకంటూ ఫాలోయింగ్ తెచ్చుకున్న సాయి, ఇప్పుడు సినిమా మ్యూజిక్‌లోనూ బిజీ అవుతున్నారు. కొత్త సౌండ్‌తో యువతను ఆకట్టుకోవడం అతని బలం. అదే సమయంలో రెండున్నర గంటల కథకు తగ్గట్టు బీజీఎం ఇవ్వడంలో మరింత అనుభవం అవసరం. అది ఒక్క సినిమాతో వచ్చేది కాదు.

ఇక సాయి చేతిలో అల్లు అర్జున్, అట్లీ 'రాకా' ఉంది. బన్నీ లాంటి స్టార్ హీరో సినిమాకు పాటలతో పాటు యాక్షన్ సీన్ల బీజీఎం కూడా చాలా ముఖ్యం. అట్లీ తన సినిమాల్లో మ్యూజిక్‌కు మంచి స్పేస్ ఇస్తారు. ఈ కాంబినేషన్‌లో సాయి ఎలాంటి స్కోర్ ఇస్తారనే అంచనాల బజ్ గట్టిగానే ఉంది. మరి ఆ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.