అనిరుధ్‌ను కొట్టే మొనగాడు అవుతాడా..
తమిళ సినిమాల్లో కొన్నేళ్ల క్రితం ఏ పెద్ద సినిమా చూసినా హారిస్ జయరాజ్, యువన్ శంకర్ రాజా, జీవీ ప్రకాష్ పేర్లు ఎక్కువగా వినిపించేవి.
By: M Prashanth | 2 Sept 2026 5:00 PM ISTతమిళ సినిమాల్లో కొన్నేళ్ల క్రితం ఏ పెద్ద సినిమా చూసినా హారిస్ జయరాజ్, యువన్ శంకర్ రాజా, జీవీ ప్రకాష్ పేర్లు ఎక్కువగా వినిపించేవి. ఏఆర్ రెహమాన్ తన స్థాయిలో కొనసాగుతున్నా, కమర్షియల్ స్టార్ సినిమాల్లో ఈ ముగ్గురికి మంచి డిమాండ్ ఉండేది. అలాంటి సమయంలో ‘3’ సినిమాతో వచ్చిన అనిరుధ్ చాలా స్పీడ్ గా దూసుకొచ్చాడు. విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ నుంచి ఎన్టీఆర్ వరకు పెద్ద హీరోల సినిమాలు అతని చేతికి వెళ్లాయి. కొన్నేళ్లలోనే స్టార్ సినిమాలకు మొదటి ఆప్షన్స్‌లో ఒకడిగా మారిపోయాడు.
ఇప్పుడు సాయి అభ్యంకర్ జర్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ‘కచ్చి సెర’, ‘ఆస కూడ’ లాంటి ఇండిపెండెంట్ పాటలతో ముందుగా పేరు తెచ్చుకున్న సాయి, తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. 2025లో ‘బల్టీ’తో ఫీచర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తమిళంలో ‘డ్యూడ్’ చేశాడు. ఈ ఏడాది సూర్య ‘కరుప్పు’కు సంగీతం ఇచ్చాడు. అందులోని కొన్ని పాటలు రిలీజ్ తర్వాత బాగా క్లిక్ అయ్యాయి.
అసలు లెక్క ఇప్పుడు అతని చేతిలో ఉన్న సినిమాల దగ్గర ఉంది. అల్లు అర్జున్, అట్లీ రాకా, ధనుష్ ఓం, వెట్రిమారన్‌తో తమిళ్ మురుగన్, సూర్య 48, కార్తి మార్షల్, రాఘవ లారెన్స్ బెంజ్, విజయ్ సేతుపతి ‘బత్తా’ ఇలా వరుసగా పెద్ద సినిమాలు ఉన్నాయి. కెరీర్ మొదలైన కొద్ది కాలానికే ఇంతమంది స్టార్ హీరోల ప్రాజెక్టులు రావడం చిన్న విషయం కాదు.
అయితే ఇక్కడే అనిరుధ్‌తో పోలిక పూర్తిగా పెట్టేయడం తొందర అవుతుంది. అనిరుధ్ ఒకటి రెండు వైరల్ పాటలతో ఆగలేదు. స్టార్ హీరోల ఇంట్రోలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పూర్తి ఆల్బమ్స్ ఇలా వరుసగా సినిమాల్లో తన పని చూపించాడు. పెద్ద సినిమా అంటే పాటలతో పాటు థియేటర్‌లో బిజిఎం కూడా చాలా ప్రభావం చూపుతుంది. ఆ స్థాయిలో సాయి ఇంకా చాలా సినిమాలు చేయాల్సి ఉంది.
మరోవైపు అనిరుధ్ డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు. రజనీకాంత్ ‘ధర్మన్’లాంటి పెద్ద సినిమాలు ఇంకా అతని చేతిలోనే ఉన్నాయి. కాబట్టి సాయి రావడం అంటే అనిరుధ్ ప్లేస్ ను కొట్టేస్తాడని కాదు. కానీ పెద్ద దర్శకులు కొత్తగా మరో సంగీత దర్శకుడిని ట్రై చేయాలనుకున్నప్పుడు సాయి పేరు ఇప్పుడు ముందుకు వస్తోంది. ఒకేసారి ఇన్ని పెద్ద అవకాశాలు రావడం వల్ల అతనికి ఆ స్థానం సంపాదించుకునే ఛాన్స్ మాత్రం వచ్చింది.
ఈ లైన్ లో ‘రాకా’ సాయికి ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద చాన్స్. అట్లీ సినిమా, అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ కావడంతో పాటలుకు రీచ్ బాగుంటుంది. ఆ ఆల్బమ్‌తో పాటు ఓం, సూర్య 48, మార్షల్ లో కూడా వరుసగా పాటలు క్లిక్ అయితే అప్పుడే అసలు పోటీ మొదలవుతుంది. అనిరుధ్ వచ్చినప్పుడు పాత పేర్ల మధ్య ఎలా కొత్త స్పేస్ తెచ్చుకున్నాడో, ఇప్పుడు ఆ స్పేస్ కోసం సాయి కూడా రెడీ అవుతున్నాడు.
