Begin typing your search above and press return to search.

అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్ హవా!

స్వతంత్ర సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ శ్రోతలను సంపాదించుకున్న ఈ యువ సంచలనం ఇప్పుడు వరుసగా సౌత్‌లోని అగ్ర కథానాయకుల భారీ ప్రాజెక్టులను ఖాతాలో వేసుకుంటూ పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.

By:  Srikanth Kontham   |   28 Sept 2026 1:00 AM IST
అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్ హవా!
X

సౌత్ ఇండ‌స్ట్రీ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఆధిపత్యం కొనసాగుతున్న వేళ ఆయనకు ధీటుగా పోటీనిస్తూ మరో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హవా చూపిస్తున్నాడు. స్వతంత్ర సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ శ్రోతలను సంపాదించుకున్న ఈ యువ సంచలనం ఇప్పుడు వరుసగా సౌత్‌లోని అగ్ర కథానాయకుల భారీ ప్రాజెక్టులను ఖాతాలో వేసుకుంటూ పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ ప్రతిష్ఠాత్మక పాన్-వరల్డ్ చిత్రం `రాకా`కి సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం ఇండస్ట్రీలో ఇప్ప‌టికే చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అట్లీ చిత్రాలకు అనిరుధ్ లేదా ఏఆర్ రెహమాన్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటారు. అయితే `రాకా` కోసం సాయి అభ్యంకర్‌లోని ప్రతిభను నమ్మి అవకాశం ఇవ్వడం ఆయన క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఈ సినిమా కోసం సాయి అందించిన `మేక్ వే ఫర్ ది కింగ్` థీమ్ ట్రాక్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది.

అలాగే తమిళంలో అగ్ర నటులైన సూర్య, ధనుష్‌లతో పాటు పలువురు స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టులకి కూడా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. `కట్చి సేర`, `ఆస కూడ` వంటి ఇండిపెండెంట్ పాప్‌ సాంగ్స్‌తో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన యంగ్ కంపోజర్ అతి తక్కువ కాలంలోనే ట్రేడ్ వర్గాల్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు.

ప్రముఖ గాయక దంపతులు తిప్పు, హరిణిల తనయుడైన సాయి అభ్యంకర్ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చినా? తనకంటూ విలక్షణమైన శైలిని సొంతం చేసుకుంటున్నాడు. అనేక రకాల వాద్యపరికరాలపై పట్టు ఉన్న సాయి వెస్ట్రన్-ఫ్యూజన్ మెలోడీలను నేటి తరం అభిరుచికి తగ్గట్టుగా అందిస్తూ భారీ మాస్, యూత్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నాడు.

కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు, స్టార్ హీరో ప్రాజెక్టులంటే అనిరుధ్ పేరే గుర్తుకొచ్చేది. కానీ ప్రస్తుతం బడా నిర్మాతలు, దర్శకులు అనిరుధ్‌కి ప్రత్యామ్నాయంగా సరికొత్త వైబ్, ఫ్రెష్ సౌండింగ్ ఇస్తున్న సాయి అభ్యంకర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అనతికాలంలోనే అనిరుధ్ స్థాయిలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సాయి సరికొత్త మ్యూజికల్ రేస్‌ను ప్రారంభించాడు.

మొత్తానికి సౌత్ ఇండియాలోనే బిజీయెస్ట్ మ్యూజిక్ కంపోజర్‌గా మారుతోన్న‌ సాయి అభ్యంకర్ హవా రాబోయే రోజుల్లో మరింత పెరగడం ఖాయం. సరికొత్త శబ్ద తరంగాలతో శ్రోతలను మైమరిపిస్తున్న ఈ యంగ్ సంచలనం.. అనిరుధ్‌తో నడుస్తున్న ఈ మ్యూజికల్ కాంపిటీషన్‌లో రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.