21 ఏళ్లకే నోలన్ అంటున్నాడే..
సాయి అభ్యంకర్ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. కానీ ఈ కుర్రాడి టార్గెట్ మాత్రం ఏకంగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ స్థాయికి చేరింది.
By: M Prashanth | 18 Aug 2026 8:15 AM ISTసాయి అభ్యంకర్ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. కానీ ఈ కుర్రాడి టార్గెట్ మాత్రం ఏకంగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ స్థాయికి చేరింది. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి భవిష్యత్తులో నోలన్ తో పని చేయాలనే కోరికను బయటపెట్టాడు. గతంలో కొందరు ఫ్యాన్స్ ఏఐ సాయంతో నోలన్ తన మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నట్లు ఒక వీడియో క్రియేట్ చేశారని, అది రియల్ లైఫ్ లో జరిగితే చూడాలని ఉందని మనసులోని మాట పంచుకున్నాడు.
2024లో కచ్చి సేరా, ఆసా కూడ లాంటి పాటలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ కుర్రాడు. ఆ తర్వాత బాల్టీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయ్యాడు. డ్యూడ్ సినిమాతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అందులోని ఊరం బ్లడ్ సాంగ్ ఏకంగా వంద మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది. ఈ ఏడాది సూర్య కరుప్పు బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు మ్యూజిక్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సాయి రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఇండస్ట్రీలో ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా ప్రాజెక్ట్ కు సాయి సంగీతం అందిస్తున్నాడు. అలాగే ధనుష్, రాజ్ కుమార్ పెరియసామి సినిమాతో పాటు కార్తి హీరోగా వస్తున్న మార్షల్ మూవీ కూడా ఇతని చేతిలోనే ఉంది. రాఘవ లారెన్స్ బెంజ్ తో పాటు సూర్యతో మరో కొత్త ప్రాజెక్ట్ కు కూడా మ్యూజిక్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇండస్ట్రీలో కొన్నేళ్ల పాటు ప్రయాణం చేస్తే కానీ ఇలాంటి ఆఫర్స్ రావు. ఈ అరుదైన అవకాశం రాకా సినిమాతోనే సాయికి దక్కింది. తన మొదటి పాట రిలీజ్ అయినప్పుడు ఇంత త్వరగా బన్నీ, అట్లీ కాంబోకు పని చేస్తానని కలలో కూడా ఊహించలేదని సాయి చెప్పుకొచ్చాడు. 21 ఏళ్ల వయసులో ఇలాంటి ఒక భారీ సినిమాను హ్యాండిల్ చేయడం నిజంగా పెద్ద విషయమే. అందుకే సాయి నోలన్ పేరు ప్రస్తావించడం చూస్తుంటే కేవలం పబ్లిసిటీ కోసం చెప్పినట్లు అనిపించడం లేదు.
రేపటికల్లా ఆ ఛాన్స్ వస్తుందని ఎవరూ చెప్పలేరు. కానీ ఈ కుర్రాడి ఆలోచనా విధానం మాత్రం ఒక చిన్న గిరి గీసుకుని కూర్చునేలా లేదు. యూట్యూబ్ పాటలతో సరిపెట్టుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. ఇక్కడ కూడా చిన్న ప్రాజెక్టులతో కాలక్షేపం చేయకుండా వచ్చిన భారీ అవకాశాలను చేజిక్కించుకుంటూ ఎవరికీ అందనంత స్పీడ్ గా దూసుకెళ్తున్నాడు.
ఇప్పటికైతే సాయి ముందున్న అతిపెద్ద సవాల్ రాకా సినిమానే. అట్లీ మార్క్ ఎలివేషన్స్, బన్నీ రేంజ్ కు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ సౌండింగ్ ప్లాన్ చేస్తున్నానని, విదేశీ మ్యూజిషియన్స్ తో కలిసి పని చేసే ఆలోచన ఉందని సాయి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. తాను అనుకున్న ఈ ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే ఆ తర్వాత సాయి టార్గెట్స్ రేంజ్ ఇంకో స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
