స్క్రీన్ కౌంట్ పైనే సక్సెస్ ఆధారపడి ఉందా?
ముఖ్యంగా చిన్న సినిమాలకు తొలి వీకెండ్ చాలా కీలకం. మొదటి 2-3 రోజుల్లో మంచి ఆక్యుపెన్సీ వస్తే థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
By: M Prashanth | 5 Sept 2026 11:20 AM ISTచిన్న సినిమాలకు కంటెంట్ ఎంత ముఖ్యమో.. థియేటర్లలో దక్కే స్క్రీన్లు, షో టైమింగ్స్ కూడా అంతే కీలకం. సినిమా విడుదలకు ముందు మంచి బజ్ రావడం, ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరగడం ఒక ఎత్తైతే.. ఆ ఆసక్తిని థియేటర్లకు తీసుకురావడం మరో ఎత్తు. ఇప్పుడు సహా సినిమా విషయంలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా నటించిన సహా సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చింది.
విడుదలకు ముందే సినిమాపై కొంత బజ్ ఏర్పడింది. మూవీ టీమ్ చేసిన ప్రమోషన్స్ కారణంగా మూవీకి ఆడియన్స్ లో మంచి బజ్ వచ్చింది. ముఖ్యంగా యూత్ లో సినిమాపై ఆసక్తి కనిపించిందని మూవీ టీమ్ చెబుతోంది. దీంతో ప్రీమియర్స్ కు కూడా చెప్పుకోదగ్గ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మరో సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది.
సినిమాకు ఎక్కువగా మార్నింగ్, మ్యాట్నీ షోలు కేటాయించడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని మూవీ టీమ్ చెబుతోంది. సాధారణంగా యూత్ సినిమాలు చూసేందుకు సాయంత్రం, రాత్రి వేళల్లో ఎక్కువగా థియేటర్లకు వస్తుంటారు. అలాంటి ప్రైమ్ టైమింగ్స్ లో ఎక్కువ షోలు దక్కితే సినిమాకు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడే సహాకు స్క్రీన్ కౌంట్ కీలకంగా మారింది. ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్నప్పటికీ థియేటర్లు, షోలు తక్కువగా ఉంటే సినిమా ఎంతవరకు ముందుకు వెళ్తుందన్నది ప్రశ్నగా మారుతుంది.
ముఖ్యంగా చిన్న సినిమాలకు తొలి వీకెండ్ చాలా కీలకం. మొదటి 2-3 రోజుల్లో మంచి ఆక్యుపెన్సీ వస్తే థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రేక్షకులకు అందుబాటులో లేకపోతే.. ఆసక్తి ఉన్నవారూ మరో సినిమావైపు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ స్క్రీన్లు, సరైన షో టైమింగ్స్ దక్కితే సినిమా మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. అయితే ఇది సహా సినిమాకు మాత్రమే ఎదురైన సమస్య కాదు.
ప్రస్తుతం ఒకేసారి పలు సినిమాలు థియేటర్లలో పోటీ పడుతున్నాయి. దీంతో స్క్రీన్ల కోసం పోటీ పెరిగింది. ఇటీవల కొన్ని సినిమాలు కూడా థియేటర్లు, షో టైమింగ్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి స్క్రీన్ల కొరతను కేవలం సహా సినిమాకు సంబంధించిన సమస్యగా చూడలేం. మరోవైపు ప్రేక్షకుల నుంచి వచ్చే మౌత్ టాక్ కీలకమే. రివ్యూలు మిక్స్ డ్ గా ఉన్నప్పటికీ.. యువత నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పెరిగితే సినిమా నిలబడే అవకాశం ఉంటుంది.
ప్రేక్షకుల ఆసక్తి కలెక్షన్లుగా మారితే థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది. అందుకే ప్రస్తుతం సహా విషయంలో అసలు ప్రశ్న సినిమా ఎలా ఉందన్నదానికంటే.. ప్రేక్షకులకు సినిమా ఎంత ఈజీగా అందుబాటులో ఉందన్నదిగా మారింది. మంచి టాక్ ఉన్న సినిమాకు స్క్రీన్లు పెరిగితే కలెక్షన్లు కూడా పెరగొచ్చు. కానీ స్క్రీన్లు, ముఖ్యంగా ప్రైమ్ టైమ్ షోలు పరిమితంగా ఉంటే ఆ ఎఫెక్ట్ బాక్సాఫీస్ పై కనిపించే అవకాశం ఉంటుంది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.
