సఃకుటుంబానాం లాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలి
డైరెక్టర్ ఉదయ్ శర్మ మాట్లాడుతూ 2026లో ఫస్ట్ హిట్ గా తమ సినిమా రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ సక్సెస్ కు కారణమైన ఆడియన్స్‌కు, సపోర్ట్ చేసిన మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు.
By: Sravani Lakshmi Srungarapu | 3 Jan 2026 12:53 PM ISTరామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రచ్చ రవి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన సినిమా సఃకుటుంబానాం. ఉదయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1న రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను హెచ్ఎన్‌జి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్ లో మహదేవ్ గౌడ్, నాగరత్న సంయుక్తంగా నిర్మించగా, కుటుంబ కథా చిత్రంగా వచ్చిన సఃకుటుంబానాం కొత్త సంవత్సరంలో మొదటి హిట్ గా నిలవడంతో చిత్ర యూనిట్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
సక్సెస్‌మీట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, తెలుగు ఆడియన్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ, తాను 48 ఏళ్లుగా అందరికీ ఓ ఫ్యామిలీ మెంబర్ లా ఉన్నానని, ఇలాంటి మంచి సినిమాను ఆదరించి సినిమాను హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలియచేశారు. ఫ్యామిలీ మూవీస్ ను ఆదరించడంలో తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారని చెప్పిన ఆయన, సఃకుటుంబానాం మూవీని ఆడియన్స్ ఫ్యామిలీతో కలిసి చూడటం ఆనందాన్నిస్తుందన్నారు. తాను బతికున్నంత కాలం తెలుగు ఆడియన్స్ కోసం నటిస్తూనే ఉంటానని, ఇలాంటి మంచి కథలతో దర్శకనిర్మాతలు మరిన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని, ఆడియన్స్ వాటిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానన్నారు.
డైరెక్టర్ ఉదయ్ శర్మ మాట్లాడుతూ 2026లో ఫస్ట్ హిట్ గా తమ సినిమా రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ సక్సెస్ కు కారణమైన ఆడియన్స్‌కు, సపోర్ట్ చేసిన మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇంత మంచి సినిమాను నిర్మించిన నిర్మాతలకు, సినిమాలో నటించి సపోర్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి, మిగిలిన నటీనటులకు ఋణపడి ఉంటానన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఒక సినిమా నచ్చితే అది హిట్ అవుతుందని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి నేర్చుకున్నానని అన్నారు.
నిర్మాత మహదేవ్ గౌడ్ మాట్లాడుతూ తమసినిమాను ఆదరించి మంచి హిట్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు చెప్పారు. తమ మొదటి సినిమాకు సపోర్ట్ చేస్తూ నటించిన రాజేంద్ర ప్రసాద్ గారికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇప్పుడు తమ సినిమాకు థియేటర్లు పెరుగుతున్నాయని, ఇంకా సినిమా చూడని వాళ్లు చూడాలని కోరుకుంటున్నానన్నారు.
హీరోగా నటించిన రామ్ కిరణ్ మాట్లాడుతూ, తన ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకోవడం చాలా సంతోషంగా అనిపించిందని, మూవీలో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు అని మరోసారి ప్రూవ్ చేస్తారని, సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని తనకు ప్రేక్షకులే బ్యాక్‌గ్రౌండ్ అని, తనను, తమ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.
యాక్టర్ నవీన్ జివి మాట్లాడుతూ అందరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. ఇది తన మొదటి సినిమా అని, ఈ మూవీలో యాక్ట్ చేయడం, రాజేంద్ర ప్రసాద్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
