టీవీ నటుడిపై లైంగిక వేధింపులు- దాడి ఆరోపణలు
ఈ ఘటనపై ఒక ఇంటర్వ్యూలో సాన్వీ మాట్లాడుతూ ఆనాటి భయానక అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
By: Sivaji Kontham | 24 July 2026 10:23 AM ISTఇటీవలి కాలంలో గ్లామర్ రంగంలో వేధింపుల ఆరోపణలు ఆగడం లేదు. ఇప్పుడు ప్రముఖ టీవీ నటుడు, షో ఎపిసోడ్ దర్శకుడిపై ప్రముఖ టీవీ నటి తీవ్రంగా ఆరోపించారు. పాపులర్ టీవీ నటుడు కరణ్ కుంద్రా ఒక ప్రజాదరణ పొందిన షో ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని... భౌతికంగా దాడికి ఒడిగట్టాడని నటి సాన్వీ తల్వార్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఆ ఎపిసోడ్ దర్శకుడు కూడా కరణ్‌కు సహకరిస్తూ తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఆమె పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఒక ఇంటర్వ్యూలో సాన్వీ మాట్లాడుతూ ఆనాటి భయానక అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ''ఆ రోజు ఒక సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. కానీ దర్శకుడు ఇంకా ప్రారంభించకముందే కరణ్ నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ప్రవర్తనకు షాక్ అయి నేను వెంటనే అతడిని చెంపదెబ్బ కొట్టాను. ఆ సమయంలో అతనేమీ స్పందించలేదు కానీ కాసేపటి తర్వాత తిరిగొచ్చి నన్ను చాలా గట్టిగా చెంపపై కొట్టాడు. ఒక ఆడపిల్ల కొట్టే దెబ్బకు.. ఒక మగాడు కొట్టే దెబ్బ తీవ్రతకు చాలా తేడా ఉంటుంది. ఆ దెబ్బకు నేను కిందపడిపోయాను. ఆ తర్వాత నన్ను, నా కుటుంబాన్ని దారుణమైన బూతులతో దూషించాడు'' అని ఆరోపించారు.
ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా.. తన పని తాను చేసుకుపోవడం ఆ దర్శకుడికి, కరణ్‌కు నచ్చేది కాదని.. అందుకే తనను టార్గెట్ చేశారని త్రోబ్యాక్ దృశ్యాన్ని వెల్లడించారు. పురుషుల చూపుల్లోని ఉద్దేశాలను మహిళలు సులభంగా గ్రహించగలరని.. కరణ్‌కు తనపై ఆసక్తి ఉందనే విషయం తనకు అర్థమైందని.. అయితే తాను దానికి ఏమాత్రం ప్రోత్సహించలేదని మరొక ఇంటర్వ్యూలో తెలిపారు.
సెట్‌పై ఏకాకిని చేశారు.. ఏక్తా కపూర్ క్షమాపణలు!
ఈ ఘటన తర్వాత చిత్రీకరణ సమయంలో ఎవరూ తనకు మద్దతుగా నిలబడలేదని సాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ఎపిసోడ్‌ను నిర్మించిన ఏక్తా కపూర్, కరణ్ తరఫున తనకు క్షమాపణలు చెప్పారని.. తనకు మద్దతుగా నిలిచి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారని తెలిపారు.
అప్పట్లో కరణ్ నటి అనూషా దండేకర్ తో ప్రేమలో ఉండేవాడని.. ఈ ఘటన తర్వాత ఆమె కూడా షూటింగ్ సెట్‌కు రావడం మొదలుపెట్టిందని సాన్వీ చెప్పారు. ఆ తర్వాత కరణ్.. దర్శకుడు కలిసి సెట్‌లోని వాతావరణాన్ని చాలా విషపూరితంగా మార్చారని... తాను ఎదురుతిరిగినందుకు దర్శకుడు తన నటనపై వేలిత్తి చూపుతూ వేధించాడని ఆరోపించారు.
స్పందించని కరణ్ కుంద్రా - తేజస్వి ప్రకాశ్
సాన్వీ తల్వార్ పలు మీడియా సంస్థల వద్ద ఈ ఆరోపణలు చేసినా.. కరణ్ కుంద్రా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల ఒక లైవ్ కార్యక్రమంలో కరణ్‌తో నిశ్చితార్థం చేసుకున్న అతడి కాబోయే భార్య, నటి తేజస్వి ప్రకాశ్ కూడా ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో కరణ్ కుంద్రా స్పందన ఎలా ఉండబోతోందనేది ప్రస్తుతం బుల్లితెర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
