Begin typing your search above and press return to search.

చిరంజీవితో విజయ్ ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?

షూటింగ్ స్పాట్‌లో ఎస్.ఏ. చంద్రశేఖర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారట. అందుకే ఆయనను ‘కమాండింగ్ డైరెక్టర్’ అని పిలిచేవారు.

By:  Madhu Reddy   |   5 May 2026 4:19 PM IST
చిరంజీవితో విజయ్ ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?
X

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ తన 'టీవీకే' పార్టీతో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ సినీ ప్రయాణం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. మీకు తెలుసా? ఒకప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి వరుస హిట్లు ఇచ్చింది విజయ్ తండ్రే. 1981లో వచ్చిన ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్, బాక్సాఫీస్ వద్ద మూడు బ్లాక్ బస్టర్లను అందించింది. విజయ్ తండ్రికి తెలుగులో అంతటి బ్రేక్ ఇచ్చింది చిరంజీవి కావడం విశేషం.

చిరంజీవికి బ్రేక్ ఇచ్చిన 'చట్టానికి కళ్లు లేవు':

ఎస్.ఏ. చంద్రశేఖర్ కి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘చట్టానికి కళ్లు లేవు’. 1981లో వచ్చిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, చంద్రశేఖర్ ని ఒక పవర్‌ఫుల్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇక ఆ తర్వాత వీరిద్దరి కలయికలో పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు వంటి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుని, ఆ కాలంలో ట్రెండ్ సెట్ చేశాయి.

కమాండింగ్ డైరెక్టర్ ఎస్.ఏ. చంద్రశేఖర్:

షూటింగ్ స్పాట్‌లో ఎస్.ఏ. చంద్రశేఖర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారట. అందుకే ఆయనను ‘కమాండింగ్ డైరెక్టర్’ అని పిలిచేవారు. తాను రాసుకున్న స్క్రీన్‌ప్లే లేదా డైలాగులను మార్చడం ఆయనకు అస్సలు నచ్చేది కాదు. ఇక అందుకే పెద్ద సూపర్ స్టార్ల కంటే కొత్తగా వచ్చే నటులతో పనిచేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. ఇక ఎంతటి క్రమశిక్షణతో ఉండేవారంటే, కేవలం 9 ఏళ్లలోనే రికార్డ్ స్థాయిలో 60 సినిమాలు డైరెక్ట్ చేశారంటే ఆయన పని వేగాన్ని అర్థం చేసుకోవచ్చు.

రీమేక్ కింగ్.. ఇక్కడ హిట్ అయితే అక్కడ కూడా:

తెలుగులో చిరంజీవితో తీసిన సూపర్ హిట్ సినిమాలను తమిళంలో విజయ్ కాంత్ లాంటి హీరోలతో రీమేక్ చేసి అక్కడ కూడా పెద్ద సక్సెస్ సాధించేవారు చంద్రశేఖర్ . ఉదాహరణకు, చిరంజీవి ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాను తమిళంలో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇలా తెలుగు, తమిళ భాషల మధ్య ఒక వారధిలా నిలిచి ఎన్నో విజయవంతమైన చిత్రాలను మనకు అందించారు.

ఒకప్పుడు తండ్రి వెండితెరపై సృష్టించిన సంచలనం ఇప్పుడు కొడుకు రాజకీయ తెరపై చూపిస్తున్నారు. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ తాజా ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, తమిళ గడ్డపై డీఎంకే, అన్నాడీఎంకేలకు గట్టి పోటీ ఇచ్చింది. నటుడిగా కోట్లాది మంది మనసులు గెలుచుకున్న విజయ్, ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని రాజకీయాల్లో కూడా చాటుతున్నారు.

సినిమా అయినా, రాజకీయం అయినా విజయ్ కుటుంబానికి ఉన్న పట్టు అద్భుతం. మెగాస్టార్ చిరంజీవితో మొదలైన ఆ కుటుంబ అనుబంధం, నేడు ఒక రాజకీయ విప్లవంగా మారి చరిత్ర సృష్టిస్తోంది. ఇక తండ్రి దర్శకత్వంలో రికార్డులు సృష్టించిన విజయ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎలాంటి మార్పులు తెస్తారో చూడాలి.