జన నాయగన్ ఇష్యూ.. విజయ్ తండ్రి కీలక వ్యాఖ్యలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీతోపాటు ఆయన నటించిన చివరి చిత్రం జన నాయగన్ విడుదల ఆలస్యంపై కొనసాగుతున్న చర్చలపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శక- నిర్మాత ఎస్‌ఏ చంద్రశేఖర్ రెస్పాండ్ అయ్యారు.
By: M Prashanth | 29 Jan 2026 1:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీతోపాటు ఆయన నటించిన చివరి చిత్రం జన నాయగన్ విడుదల ఆలస్యంపై కొనసాగుతున్న చర్చలపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శక- నిర్మాత ఎస్‌ఏ చంద్రశేఖర్ రెస్పాండ్ అయ్యారు. కరూర్ లో జరిగిన ఘటనలపై ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని, విజయ్ ఎలాంటి సవాళ్లకైనా భయపడని వ్యక్తి అని ఆయన స్పష్టం చేశారు.
విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్టింగ్ స్టేజ్ లో ఇలాంటి అడ్డంకులు రావడం సహజమేనని చంద్రశేఖర్ తెలిపారు. "కరూర్ లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. విజయ్ దేనికీ భయపడడు. రాజకీయాల్లోకి వచ్చిన మొదటి దశలో ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ విజయ్ ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు" అని ఆయన అన్నారు.
అలాగే విజయ్ నటించిన జన నాయగన్ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంపై కూడా ఆయన స్పందించారు. సినిమా విడుదల ఆలస్యానికి గల కారణాలు ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా తెలుసునని చెప్పారు. కావాలనే మూవీ రిలీజ్ ను ఆపలేదని, చట్టపరమైన సమస్యల వల్ల జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఆ అంశాన్ని రాజకీయంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువతలో రాజకీయ చర్చ పెరిగిందని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. "విజయ్ పాలిటిక్స్‌లోకి వచ్చాక యువత రాజకీయాల గురించి మాట్లాడుతోంది. నిజానికి నా కన్నా వాళ్లకు రాజకీయాలపై స్పష్టత ఉంది" అని చెప్పారు. యువత ఆలోచనల్లో వస్తున్న ఈ మార్పు ప్రజాస్వామ్యానికి శుభసూచకమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, విజయ్ హీరోగా తెరకెక్కిన జన నాయగన్ సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని జనవరి 9న మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
కేసును స్వీకరించిన డివిజన్ బెంచ్ సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. ఈ స్టేను వ్యతిరేకిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నేపథ్యంలో జనవరి 21న డివిజన్ బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు జరిగాయి.
అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌ను మంగళవారం ఆదేశించింది. దీంతో జన నాయగన్ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా విజయ్ రాజకీయ ప్రవేశం, జన నాయగన్ సినిమా చుట్టూ నెలకొన్న పరిణామాలు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ విజయ్ ముందుకు సాగుతారన్న నమ్మకాన్ని ఆయన తండ్రి వ్యక్తం చేయడం విశేషం.
