సినిమా టైటిల్స్‌పై సెన్సార్ కత్తి… మేకర్స్‌కు కొత్త టెన్షన్
తాజాగా డైరెక్టర్ గా మారి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన సరస్వతి మూవీ టైటిల్‌పై జరిగిన మార్పు ఈ చర్చను మరింత వేగవంతం చేసింది.
By: Sravani Lakshmi Srungarapu | 5 March 2026 12:10 PM ISTసినిమా టైటిల్స్ విషయంలో కొత్త చర్చకు తెరలేచింది. ముఖ్యంగా దేవుడు లేదా దేవతల పేర్లను సినిమా టైటిల్స్‌లో ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తాజాగా డైరెక్టర్ గా మారి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన సరస్వతి మూవీ టైటిల్‌పై జరిగిన మార్పు ఈ చర్చను మరింత వేగవంతం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సరస్వతి అనే టైటిల్‌ను S. సరస్వతిగా మార్చాలని చిత్ర బృందానికి సూచించినట్లు తెలుస్తోంది. దేవత పేరును నేరుగా టైటిల్ గా పెట్టడం వల్ల కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని భావించి సెన్సార్ బోర్డు ఈ మార్పు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
హే భగవాన్ ను హే బల్వంత్ గా మార్పు
ఇదొక్కటే కాదు, రీసెంట్ గా సుహాస్ హీరోగా తెరకెక్కిన హే భగవాన్ సినిమాకు కూడా ఆఖరి నిమిషంలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ సినిమాకు మొదట హే భగవాన్ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినప్పటికీ, సెన్సార్ అభ్యంతరాల కారణంగా దానిని హే బాల్వంత్‌గా మార్చాల్సి వచ్చింది. ఇలాంటి మార్పులు రెగ్యులర్ గా జరుగుతుండటంతో, మూవీ టైటిల్స్ విషయంలో ఇప్పుడు మేకర్స్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్రియేటివ్ ఫ్రీడమ్ లో భాగమే!
కాగా ఈ విషయంపై ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సెన్సార్ బోర్డు నిర్ణయాలు ఆడియన్స్ ఎమోషన్స్ ను గౌరవించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని కొందరంటుంటే, ఇంకొందరు మాత్రం సినిమా టైటిల్ అనేది సినిమా క్రియేటివ్ ఫ్రీడమ్‌లో భాగమని, దానిపై కూడా ఇంతగా నియంత్రణ అవసరమా అని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత, ఏ చిన్న విషయం అయినా త్వరగా వివాదంగా మారే పరిస్థితి ఉన్నందున మేకర్స్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
నిర్మాతలకు లేనిపోని ఖర్చులు
ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. మొన్నా మధ్య అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన జానకి సినిమాకు కూడా రిలీజ్ దగ్గరపడినప్పుడే టైటిల్ మార్చాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా లాస్ట్ మినిట్ లో సినిమాకు టైటిల్ మార్చడం వల్ల నిర్మాతలకు లేనిపోని ఖర్చులు ఎక్కువైపోతాయి. మళ్లీ కొత్త టైటిల్ తో పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ అన్నీ రెడీ చేయాల్సి రావడం, కానీ దానికి తక్కువ టైమ్ ఉండటం వల్ల అవన్నీ వృధా ఖర్చులే అవుతాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, భవిష్యత్తులో సినిమా టైటిల్స్ ఎంపికలో మేకర్స్ మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందే సెన్సార్ సంబంధిత సూచనలు తీసుకోవడం లేదా ముందుగానే టైటిల్ విషయంలో పర్మిషన్స్ తీసుకోవడం లాంటి విధానాలు అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సినిమా టైటిల్స్‌లో దేవతల పేర్లు ఉపయోగించాలా వద్దా అనే విషయంలో ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. అయితే వరుసగా జరుగుతున్న మార్పులు మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సినిమా కంటెంట్‌తో పాటు టైటిల్ సెలెక్షన్ కూడా ఇప్పుడు మరింత సెన్సిటివ్ విషయంలో మారిందని స్పష్టమవుతుంది.
