Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ 'సరస్వతి' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

By:  Madhu Reddy   |   3 April 2026 1:15 PM IST
ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఎస్‌.సరస్వతి’ ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్:

వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘ఎస్‌.సరస్వతి’ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జీవా, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించారు. ఒక సాదాసీదా నర్సు తన కూతురు కోసం వ్యవస్థతో చేసే పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం. నటిగా ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి, ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.

అసలు సరస్వతి ఎవరు? కథలోని మిస్టరీ ఏంటి?:

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. లక్ష్మి (వరలక్ష్మి) అనే అనాథ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుంటుంది. ఒక రోజు తన కూతురు ఎస్‌.సరస్వతిని స్కూల్‌లో దించి వెళ్తుంది, కానీ సాయంత్రం వచ్చేసరికి ఆ పాప కనిపించదు. స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే అసలు ఆ పేరుతో తమ స్కూల్‌లో ఏ అమ్మాయి లేదని షాకింగ్ ఆన్సర్ ఇస్తారు. ఆ తర్వాత తన పాపను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి చంపారని, ఆ శవాన్ని ఫలానా చోట పాతిపెట్టారని లక్ష్మి పోలీసులకు చెబుతుంది. కానీ తీరా పోలీసులు వెళ్లి తవ్వితే అక్కడ శవం ఉండదు. సాక్ష్యాలు లేవని కేసు కొట్టేసినా లక్ష్మి ఊరుకోదు.

వ్యవస్థపై లక్ష్మి ప్రతీకారం:

పోలీసులు, కోర్టులు కూడా సాక్ష్యాలు లేవని తనను పంపించేయడంతో లక్ష్మి స్వయంగా రంగంలోకి దిగుతుంది. తన కూతురి మరణానికి కారణమైన వారిని ఏరివేసే పని మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఒక జడ్జిని, ఐఏఎస్ అధికారిని, ఒక పోలీస్ అధికారిని హత్య చేస్తుంది. ఇక అసలు నిజంగానే లక్ష్మికి కూతురు ఉందా? లేక ఇదంతా ఆమె భ్రమనా? అసలు లక్ష్మి గతం ఏంటి? ఆమె ఎందుకు వీరందరినీ టార్గెట్ చేసింది? అనే అంశాలు చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ను మెయింటైన్ చేయడంలో దర్శకురాలిగా వరలక్ష్మి సక్సెస్ అయ్యారని చెప్పాలి.

హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించిన వరలక్ష్మి.. ఇప్పుడు డైరెక్టర్‌గానూ తన మార్క్ చూపించారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతున్న ఆమె, ఈ సినిమాలో నటన పరంగా కూడా అదరగొట్టారు. ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ వంటి సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. మీరు గనుక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కోసం చూస్తుంటే, వెంటనే అమెజాన్ ప్రైమ్‌లో ‘ఎస్‌.సరస్వతి’ని చూసేయండి!