Begin typing your search above and press return to search.

క‌న‌క‌వ‌తి స‌హ‌నాన్ని ప‌రీక్షించిన లేడీ డైరెక్ట‌ర్!

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ నటిగా దూసుకుపోతున్న రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

By:  Srikanth Kontham   |   26 Aug 2026 1:07 PM IST
క‌న‌క‌వ‌తి స‌హ‌నాన్ని ప‌రీక్షించిన లేడీ డైరెక్ట‌ర్!
X

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ నటిగా దూసుకుపోతున్న రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడనాట అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న బ్యూటీ ఇప్పుడు ఏకంగా రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం `టాక్సిక్` లోనే న‌టించింది. ఈ చిత్రం కొన్ని గంట‌ల ముందే రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా? లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ రుక్మిణిని ఎంపిక చేయ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో తాజాగా రుక్మిణి ఎంపిక వెనుక ఎంతో ఆసక్తికరమైన - ఎమోషనల్ సుదీర్ఘ ప్రయాణం ఉందని వెలుగులోకి వ‌చ్చింది.

జీవితంలో ఎన్నో వ్యక్తిగత నష్టాలు, కష్టాలను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి రుక్మిణి ఎంతో శ్రమించాల్సి వచ్చిందిట‌. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం వంటి విషాదాలను ఎదుర్కొన్న రుక్మిణి ప్రతిభను నమ్ముకుని ముందుకు సాగారు. ఏ క్షణంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేశారు. ఆ కఠినమైన శ్రమే నేడు ఆమెను అగ్ర హీరోల సరసన నటించే స్థాయికి తీసుకెళ్లింది. అయితే `టాక్సిక్` సినిమాలో అవకాశం దక్కించుకోవడం అంత సులభంగా జరగలేదని రుక్మిణి తాజాగా వెల్లడించారు.

ఈ సినిమా కోసం ఏకంగా 4 గంటల పాటు సుదీర్ఘమైన ఆడిషన్‌లో పాల్గొనాల్సి వచ్చిందట. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ రుక్మిణి నటనను పూర్తిగా పరీక్షించిన తర్వాతే పాత్రకు ఎంపిక చేశారు. ఆ నాలుగు గంటల ఆడిషన్ తన కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడుకున్నదని.. తనలోని ప్రతిభను పూర్తిగా నిరూపిం చుకోవడానికి ఆ వేదిక ఎంతో దోహదపడిందని తెలిపారు. అలా ఒక రోజు కాదు కొన్ని రోజుల పాటు ఆడిష‌న్ కు పిలిచిన‌ట్లు గుర్తు చేసుకున్నారు.

సాధార‌ణంగా ఆడిష‌న్ అంటే ఒక రోజులో తేలిపోతుంది. కానీ గీతూ మోహ‌న్ దాస్ రుక్మిణిని చాలా క్షుణ్ణంగా ప‌రిశీలించిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మ‌యంలో న‌టీమ‌ణుల‌కు ఎంతో ఓపిక స‌హనం ఉండాలి. లేదంటే విసుగు చెంది లైట్ తీసుకుంటారు. కానీ రుక్మిణీ మాత్రం ఆ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. ఎలాగైనా ఆ ఛాన్స్ త‌న‌కే రావాల‌ని ఎంతో స‌హ‌నంతో ఆడిష‌న్ కు అటెండ్ అవ్వ‌డం... గీతూ మోహ‌న్ దాస్ ను మెప్పించే వ‌ర‌కూ తాను పెట్టాల్సిన ఎఫెర్ట్ అంతా పెట్టి సాధించారు.

సుదీర్ఘ పోరాటం, అంకితభావం , ప్రతిభ ఉంటే ఏ నేపథ్యం లేకుండా కూడా ఇండస్ట్రీలో శిఖరాన్ని తాకవచ్చని రుక్మిణి వసంత్ నిరూపించి చూపించారు. కన్నడ చిత్రాలతో ప్రయాణం మొదలుపెట్టి కోలీవుడ్ , టాలీవుడ్‌తో పాటు గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్‌ల వరకు రుక్మిణి ప్ర‌యాణం యువ నటీమణులకు ఎంతో స్ఫూర్తిదాయకం. టాక్సిక్ హిట్ అయితే ఆమె స్టార్‌డమ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.