Begin typing your search above and press return to search.

దుల్కర్ సినిమాలో బిజిలీ.. ఈమె కథేంటి?

దుల్కర్ సల్మాన్ సినిమా అంటే లవ్ స్టోరీతో పాటు మంచి ఎమోషన్స్ ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు.

By:  M Prashanth   |   24 Oct 2026 7:42 PM IST
దుల్కర్ సినిమాలో బిజిలీ.. ఈమె కథేంటి?
X

దుల్కర్ సల్మాన్ సినిమా అంటే లవ్ స్టోరీతో పాటు మంచి ఎమోషన్స్ ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ఈసారి 'ఆకాశంలో ఒక తార'లో హీరో కంటే హీరోయిన్ల పాత్రలే ఎక్కువ ఆసక్తి పెంచుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు నటీమణులను పరిచయం చేసిన మేకర్స్, లేటెస్ట్ గా రుహానీ శర్మను రంగంలోకి దించారు. ఆమె పాత్ర పేరు బిజిలీ. పేరు వినగానే కాస్త మాస్‌గా అనిపిస్తున్నా, కొత్త పోస్టర్‌లో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు.




బస్సు కిటికీ పక్కన కూర్చుని చిరునవ్వుతో కనిపిస్తున్న రుహానీ లుక్ చాలా సింపుల్‌గా ఉంది. చిన్న బొట్టు, చీరకట్టు, తక్కువ మేకప్‌తో పక్కింటి అమ్మాయిని గుర్తుచేస్తున్నారు. అయితే ఈ బిజిలీ కథలోకి అనుకోకుండా వచ్చి కొన్ని పరిణామాలకు కారణమవుతుందనే హింట్ ఇచ్చారు. అసలు ఈమె ఎవరు, దుల్కర్ పాత్రతో ఎలాంటి సంబంధం ఉంటుందనే వివరాలను మాత్రం మేకర్స్ బయటపెట్టలేదు.

నిజానికి రుహానీ శర్మకు తెలుగులో 'చి ల సౌ'తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'హిట్', 'హర్'లాంటి సినిమాల్లో భిన్నమైన పాత్రలు చేశారు. గ్లామర్ కంటే కథలో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు దుల్కర్ సినిమాలో బిజిలీగా కనిపించడం ఆమెకు మరో మంచి అవకాశమే. ముఖ్యంగా ఈ పాత్రను మేకర్స్ ప్రత్యేకంగా పరిచయం చేయడం చూస్తే కథలో ఏదో కీలకమైన మలుపుతో సంబంధం ఉండొచ్చనే ఆసక్తి కలుగుతోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రకారం పల్లెటూరిలో పెరిగిన ఓ అమ్మాయి పెద్ద కలలు కనడం, వాటిని నిజం చేసుకునేందుకు హీరో అండగా నిలవడం కథలో మెయిన్ పాయింట్. కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. మరోవైపు శ్రుతిహాసన్ కూడా ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు రుహానీ చేరడంతో సినిమాలో ముగ్గురు నటీమణులకు చోటు దక్కింది. వాళ్ల పాత్రలను కథలో ఎలా కలిపారనేది ఆసక్తికరంగా మారింది.

దర్శకుడు పవన్ సాధినేని గతంలో 'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి'లాంటి సినిమాలు చేశారు. ఇప్పుడు దుల్కర్‌తో ఎమోషనల్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. దీనికి గంగరాజు గుణ్ణం రచయితగా వ్యవహరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన కథలు, డైలాగుల్లో ఉండే న్యాచురల్ హ్యూమర్ పరిచయమే. పల్లెటూరి నేపథ్యంతో పాటు మనుషుల మధ్య అనుబంధాలను చూపించే ఈ కథకు ఆయన రైటింగ్ హైలెట్ గా నిలవొచ్చు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.