పరిశోధన చేయకుండా సినిమా తీస్తారా?
ఒకానొక సమయంలో తన మ్యూజిక్‌తో శ్రోతలను ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఓ వివాదంలో చిక్కుకున్నారు.
By: Srikanth Kontham | 25 Oct 2026 9:00 PM ISTఒకానొక సమయంలో తన మ్యూజిక్‌తో శ్రోతలను ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో తనను తప్పుగా చూపించ డంపై పట్నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2000లలో వచ్చిన సినిమాల్లో తాను గరివిడి లక్ష్మి ట్యూన్లను కాపీ కొట్టానని.. ఆమెకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆర్పీ పట్నాయక్ ఘాటుగా స్పందించారు. తాను ఎవరి సంగీతాన్ని దొంగిలించ లేదన్నారు. తన సినిమాలలో (ముఖ్యంగా `చిత్రం` వంటి చిత్రాలలో) ఉపయోగించిన అనేక జానపద పాటలు తన బాల్యంలో.. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో నిత్యం వింటూ పెరిగినవేనని గుర్తు చేసుకున్నారు.
అయితే ఆర్పీ ప్రధానంగా దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము తీరుపైనే తన తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. సరైన పరిశోధన చేయకుండా తన వాదనను వినకుండా సినిమాలో తనను నెగెటివ్‌గా చూపించడాన్ని తప్పుబట్టారు. నిజ జీవిత వ్యక్తులపై బయోపిక్‌లు తీసేటప్పుడు దర్శక-నిర్మాతలు వాస్తవాలను క్షుణ్ణంగా ధృవీకరించు కోవాలని హితవు పలికారు. ఒకే వర్గం చెప్పిన మాటలను గుడ్డిగా నమ్ముకోకుండా సంబంధిత వ్యక్తులను నేరుగా సంప్రదించి సమాచారం సేకరించాల్సిన బాధ్యత దర్శకుడిపై ఉందని అభిప్రాయపడ్డారు.
తన సినిమా కెరీర్ ప్రారంభానికి ముందే గరివిడి లక్ష్మిని కలిసి ట్యూన్లు తీసుకున్నాననే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆర్పీ స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దిగజార్చేలా.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా వస్తోన్న తప్పుడు కథనాలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో నిజ జీవిత వ్యక్తిని సరైన సాక్ష్యాలు లేకుండా నెగెటివ్‌గా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఈ వివాదంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని.. ఆయనపై తాను ఎలాంటి విమర్శలు చేయడం లేదని ఆర్పీ పట్నాయక్ స్పష్టం చేశారు. అయితే సొంత చిత్రంలో ఓ ప్రముఖుడిని ఎంతగా కించపరు స్తున్నారనే విషయంపై నిర్మాతకు ఎలా అవగాహన లేకుండా పోయిందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు చేస్తున్న తప్పులను నిర్మాత ఎలా అనుమతించారనే ప్రశ్నలు కూడా ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తున్నాయి.
