Begin typing your search above and press return to search.

ప్రేమకథలతో యంగ్ హీరోకి పరీక్ష పెడుతున్న డైరెక్ట‌ర్లు

సీనియర్ యాక్ట‌ర్ శ్రీకాంత్ కొడుకు రోష‌న్ మేక ప్ర‌స్తుతం త‌న కెరీర్లో కీల‌క ద‌శ‌ను ఎదుర్కొంటున్నాడు.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 Feb 2026 5:00 PM IST
ప్రేమకథలతో యంగ్ హీరోకి పరీక్ష పెడుతున్న డైరెక్ట‌ర్లు
X

సీనియర్ యాక్ట‌ర్ శ్రీకాంత్ కొడుకు రోష‌న్ మేక ప్ర‌స్తుతం త‌న కెరీర్లో కీల‌క ద‌శ‌ను ఎదుర్కొంటున్నాడు. పెళ్లి సంద‌D సినిమా ద్వారా హీరోగా పరిచయమైన రోషన్‌కు ఆ సినిమా అనుకున్న రిజ‌ల్ట్ ను ఇవ్వ‌లేక‌పోయింది. రీసెంట్ గా తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో వ‌చ్చిన ఛాంపియ‌న్ తో రోష‌న్ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. క‌థ ప‌రంగా ఛాంపియ‌న్ కొత్త‌గా ఉన్న‌ప్ప‌టికీ, ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన బ్రేక్ ను అందుకోలేక‌పోయింది.

శైలేష్ తో ఏమో ఏమో ఇది అనే ల‌వ్ స్టోరీ

దీంతో త‌ర్వాతి ప్రాజెక్టుల ఎంపిక విష‌యంలో రోష‌న్ చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రోష‌న్ ప్ర‌స్తుతం శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఏమో ఏమో ఇది అనే ల‌వ్ స్టోరీని చేస్తున్నాడు. వాస్త‌వానికి శైలేష్ ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ్ స్టోరీని చేసింది లేదు. హిట్ లాంటి స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ స్టోరీల‌తో బాగా పాపుల‌ర్ అయిన శైలేష్, ఈ సినిమాతోనే మొద‌టిసారిగా ప్రేమ క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నారు. త‌న గ‌త సినిమాల శైలికి భిన్నంగా, ఎమోష‌న్స్ కు ప్రాధాన్య‌త‌నిచ్చే క‌థతో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోవాల‌ని శైలేష్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇంద్ర‌గంటితో మ‌రో ల‌వ్ స్టోరీ

ఆల్రెడీ శైలేష్ తో ఓ ల‌వ్ స్టోరీని చేస్తున్న రోష‌న్, ఇప్పుడు మ‌రో ప్రేమ క‌థా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. కామెడీ, ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ల‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ఈ ల‌వ్ స్టోరీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌నే వార్త ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇంద్ర‌గంటి నుంచి గ‌తంలో స‌మ్మోహ‌నం లాంటి అద్భుత‌మైన ప్రేమ క‌థ‌ను తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో క‌ష్ట‌మ్మీద హిట్ గా నిలిచింది. స‌మ్మోహ‌నం సినిమాను డైరెక్ట్ చేసిన‌ప్ప‌టికీ ఇంద్ర‌గంటి కామెడీ మ‌రియు ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్లే ఎక్కువ చేశారు.

ప‌ట్టున్న జాన‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన డైరెక్ట‌ర్లు

ఈ ఇద్ద‌రూ డైరెక్ట‌ర్లూ త‌మ‌కు మంచి ప‌ట్టున్న జాన‌ర్ ను వ‌దిలి ల‌వ్ స్టోరీల వైపు మ‌ళ్ల‌డ‌మే కాకుండా, ఇద్ద‌రూ ఒకే హీరోతో సినిమాలు చేస్తుండ‌టం విశేషం. సాధార‌ణంగా ఒక హీరో లేదా డైరెక్ట‌ర్ ఎప్పుడూ ఒకే జాన‌ర్ కు ప‌రిమిత‌మ‌వ‌డం గ‌తంలో ఎక్కువ‌గా క‌నిపించేది. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మార‌డంతో క‌థ స్ట్రాంగ్ గా ఉంటే ఆడియ‌న్స్ జాన‌ర్ ను ప‌ట్టించుకోకుండా సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రోష‌న్ తీసుకున్న డెసిష‌న్ అత‌ని కెరీర్ ను ముందుకు తీసుకెళ్లే ట‌ర్నింగ్ పాయింట్ అవుతుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ల‌వ్ స్టోరీల‌తో ఇమేజ్ క్రియేట్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు

టాలీవుడ్ లో కొత్త త‌ర‌హా కంటెంట్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న టైమ్ లో, యంగ్ హీరోగా రోష‌న్ త‌న ఇమేజ్ ను పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. ల‌వ్ స్టోరీల‌తో మంచి ఇమేజ్ ను సృష్టించుకోవాల‌నే ఆలోచ‌న రోష‌న్ లో క‌నిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులు కేవ‌లం డైరెక్ట‌ర్ల‌కే కాకుండా రోషన్ కు కూడా కీల‌క పరీక్ష‌గా మార‌నున్నాయి. మ‌రి ఈ సినిమాలు రోష‌న్ కు ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తారో చూడాలి.