శ్రీకాంత్ తనయుడి సోలో జర్నీ ఇదంతా!
ఇటీవలే రిలీజ్ అయిన `ఛాంపియన్` తో శ్రీకాంత్ తనయుడు రోషన్ మంచి విజయం అందుకున్నాడు.
By: Srikanth Kontham | 2 Jan 2026 3:19 PM ISTఇటీవలే రిలీజ్ అయిన `ఛాంపియన్` తో శ్రీకాంత్ తనయుడు రోషన్ మంచి విజయం అందుకున్నాడు. నటుడిగా విమర్శకుల ప్రశంసలు సాధించాడు. మునుపటి చిత్రాలకంటే మెరుగైన ప్రదర్శన, విజయంతో అందరి నోట రోషన్ నాననుతున్నాడు. నటుడిగా మనసు గెలుచుకున్న రోషన్ గా నీరాజనాలు అందుకుంటున్నాడు. `పెళ్లి సందడి`, `నిర్మలా కాన్వెంట్` సమయంలో రాని పాజిటివ్ బజ్ ఈ సినిమాకు వస్తుందంటే? ఎంత మెరుగైన ఫలితాలు సాధిం చిందో చెప్పొచ్చు. ఈ విజయంతో శ్రీకాంత్ కుటుంబంలో సంతోషం నిండింది.
తనయుడు సక్సెస్ అవుతున్నాడు? అన్న ధీమా ఆ కుటుంబంలో కనిపిస్తోంది. మరి రోషన్ జర్నీ వెనుక కుటుంబం ఎంతగా అండగా నిలబడింది అంటే? కేవలం రోషన్ ఎంట్రీ వరకే అన్నట్లు చెప్పొచ్చు. తొలుత రోషన్ సినిమాల్లోకి వస్తాడా? అని ప్రశ్నించగా అందుకు శ్రీకాంత్ సినిమాల్లోకి వచ్చే ఛాన్సే లేదన్నారు. ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదని...ఉద్యోగమో, వ్యాపారమో చూసుకుని సెటిల్ అవుతాడన్నారు. శ్రీకాంత్ ఆ వ్యాఖ్యలు చేసే సమయానికి రోషన్ చదువుకుంటున్నాడు. కట్ చేస్తే కొన్నాళ్లకు రోషన్ నటుడయ్యాడు.
నాగార్జున ప్రోత్బలంతో `నిర్మలా కాన్వెంట్` చిత్రంతో అది సాద్యమైంది. అంటే రోషన్ ఎంట్రీ వరకూ శ్రీకాంత్ సహకారం అందినట్లు లెక్క. శ్రీకాంత్ బ్రాండ్ తోనే రోషన్ నటుడిగా తొలి ఛాన్స్ అందుకున్నాడు. ఆ తర్వాత మాత్రం రోషన్ సోలో జర్నీ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రోషన్ విషయంలో శ్రీకాంత్ పెద్దగా పట్టించుకోరుట. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి? ఎంత జాగ్రత్తగా మెలగాలి? ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి? వంటి విషయాలు తప్ప రోషన్ ఎంచుకునే కథల విషయంలో డాడ్ ఇన్వాల్వ్ మెంట్ ఎంత మాత్రం ఉండదన్నాడు రోషన్.
తల్లి ఊహ కూడా నటే. ఆమె కూడా కొన్ని సినిమాలు చేసారు. మరి మామ్ సలహాలు ఇస్తారా? అంటే అసలు మామ్ సినిమాల గురించే ఇంట్లో మాట్లాడదని..తన వద్ద అసలే మాట్లాడదని అన్నాడు రోషన్. వీటిని బట్టి రోషన్ ప్రయాణమంతా సోలోగానే సాగుతుందని తెలుస్తోంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ కి సంబంధించి తను తప్ప ఇంకెవరూ బాధ్యులు కారు. ఇండస్ట్రీలో సోలోగానే ఎదుగుతున్నాడు. అలా ఎదిగిన వారే నిలబడతారు. ఎంత బ్యాకప్ ఉన్నా? అది ఎంట్రీ కార్డు వరకే పరిమితం. ఆ తర్వాత ట్యాలెంట్ తోనే ఎదగాలి. రోషన్ ప్రయాణం అలాగే సాగుతోంది. `ఛాంపియన్` సక్సెస్ నేపథ్యంలో కొత్త ఛాన్సులతో బిజీ కానున్నాడు. మరి కొత్త ఏడాది ఎలాంటి ప్రాజెక్ట్ లు కమిట్ అయ్యాడో? ఇంకా బయటకు రాలేదు.
