రెండు బూతులు.. సెన్సార్ వాళ్ళు తొక్కేశారు: నిర్మాత ప్రణయ్ వంగా
డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పనితీరును ప్రణయ్ వంగా ప్రశంసించారు. తక్కువ బడ్జెట్ ఇచ్చినా, ఎక్కడా కంప్లైంట్ చేయకుండా చాలా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా సినిమాను అద్భుతంగా తీశాడన్నారు.
By: M Prashanth | 31 Aug 2026 9:18 AM ISTసందీప్ రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'రోమాంచకం'. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పీచ్ చాలా క్యాజువల్ గా, ఆకట్టుకునేలా సాగింది. తాను పెద్ద పబ్లిక్ స్పీకర్‌ను కాదని, ఎవరి పేర్లైనా మర్చిపోతానని ఏకంగా ఒక చీటీ రాసుకొని వచ్చి మరీ మాట్లాడటం అందరినీ నవ్వించింది.
సినిమా రిలీజ్ గురించి చెబుతూ.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రీమియర్ షోలు వేస్తున్నట్లు ప్రణయ్ ప్రకటించారు. అక్కడ టికెట్లు దొరకని వాళ్లు తమ సినిమా ప్రీమియర్స్ కు రావొచ్చని సరదాగా అన్నారు. అలాగే సెన్సార్ గురించి మాట్లాడుతూ.. "సినిమాలో ఒకటి రెండు కస్ వర్డ్స్ ఉంటే సెన్సార్ వాళ్ళు మమ్మల్ని తొక్కేశారు. అందుకే లాస్ట్ మినిట్ లో ఆ బూతులు కూడా తీసేస్తున్నాం. ఇది ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూసే పక్కా క్లీన్ మూవీ" అని ఆయన నవ్వుతూ చెప్పారు.
ఇక సినిమాలో నటించిన వారి గురించి ప్రణయ్ ప్రత్యేకంగా మాట్లాడారు. హీరో సుమంత్ ప్రభాస్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో.. ఈ సినిమాలో 70 శాతం పాత్ర అలాగే ఉంటుందని చెప్పారు. అలాగే హీరోయిన్ అనంతిక ఈ సినిమాకు ప్రాణం పోసిందని మెచ్చుకున్నారు. నరేంద్ర రవి చేసిన కామెడీ సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని, థియేటర్ నుంచి బయటకు వచ్చాక కచ్చితంగా అతడి క్యారెక్టర్ గుర్తుంటుందని ప్రణయ్ కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈ కుర్రాళ్లందరికీ ముందు ముందు మంచి ఫ్యూచర్ ఉంటుందన్నారు.
డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పనితీరును ప్రణయ్ వంగా ప్రశంసించారు. తక్కువ బడ్జెట్ ఇచ్చినా, ఎక్కడా కంప్లైంట్ చేయకుండా చాలా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా సినిమాను అద్భుతంగా తీశాడన్నారు. అలాగే కెమెరామెన్ పవన్, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ లాంటి కొత్తవాళ్లతో, ఎన్ఐడీ నుంచి వచ్చిన పిల్లలతో డైరెక్టర్ వేణు పని చేయించుకున్న విధానం సూపర్ అన్నారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా విజయవాడ, గుంటూరులోని పలు ఇంజనీరింగ్, గర్ల్స్ కాలేజీలకు వెళ్లినప్పుడు వచ్చిన రెస్పాన్స్ ను ప్రణయ్ గుర్తుచేసుకున్నారు. ఆడిటోరియంలో స్టూడెంట్స్ చేసిన రచ్చకు తన చెవులు పగిలిపోయాయని, వాళ్ళ వైబ్ చూస్తుంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీశామన్న ఫీలింగ్ అప్పుడే వచ్చేసిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇంత మంచి ఈవెంట్ ప్లాన్ చేసిన సురేష్ గారికి, వెంకట్ కు టీమ్స్ కు థాంక్స్ చెప్పారు.
ఇక ఈవెంట్ లో ప్రణయ్ వంగా ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్నది స్క్రీన్ మీద ప్లే చేయగా.. బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ఫోటో రావడం హైలెట్. ఆమె తన ఫేవరెట్ అని, తేజాబ్, రామ్ లఖన్ రోజుల నుంచి ఆమె సినిమాలు చూస్తున్నానని సరదాగా పంచుకున్నారు. చివరగా ఈ వేడుకకు వచ్చిన విజయ్ దేవరకొండ, మెహర్ రమేష్, దర్శకుడు శౌర్యలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ఈ సెప్టెంబర్ 3న థియేటర్లకు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయాలని ప్రణయ్ వంగా కోరారు.
