Begin typing your search above and press return to search.

వెంక‌టేష్‌తో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం..న‌టి రోజా చెప్పిన అస‌లు సంగ‌తి!

90లలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రోజా అప్పట్లో అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

By:  Sivaji Kontham   |   20 Sept 2026 5:17 PM IST
వెంక‌టేష్‌తో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం..న‌టి రోజా చెప్పిన అస‌లు సంగ‌తి!
X

90లలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రోజా అప్పట్లో అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే విక్టరీ వెంకటేష్‌తో మాత్రం రోజా చాలా తక్కువ సినిమాల్లోనే నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు తక్కువగా రావడానికి తెరవెనుక జరిగిన కొన్ని పొరపాట్లు, ఇండస్ట్రీలో ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్‌లే కారణమని రోజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

ఈ విభేదాలకు ప్రధాన కారణం రోజా భర్త, దర్శకుడు ఆర్.కె. సెల్వమణికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్. సెల్వమణి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఒక సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా.. అంతలోనే తమిళంలో విజయకాంత్ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ప్రొడ్యూసర్ ఆ సినిమా రీమేక్‌ను వెంకటేష్, విజయశాంతితో వెంటనే మొదలుపెట్టారు. సెల్వమణికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రొడ్యూసర్ డేట్లు సర్దుబాటు చేయడం ఆయనను తీవ్రంగా మనస్తాపానికి గురిచేసింది. ఆ సమయంలో సెల్వమణి పడుతున్న బాధను చూసిన రోజా మనసులో ఒక చిన్న మానసిక అంతరం ఏర్పడింది.

మరోవైపు `పోకిరిరాజా` సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతున్నప్పుడు కూడా మరో సమస్య తలెత్తింది. లాబ్‌లో సాంగ్ రీల్ కట్ కావడంతో రీషూట్ ప్లాన్ చేయగా.. అక్టోబర్ 22న సెల్వమణి పుట్టినరోజు ఉండటంతో అక్టోబర్ 21నే హైదరాబాద్ వెళ్లాలని రోజా ముందుగానే ప్రొడక్షన్ టీమ్‌కు స్పష్టం చేశారు. ప్రొడక్షన్ వాళ్ళు సరేనని చెప్పి పిలిచినా.. కనీసం చిన్న ప్యాచ్ వర్క్ కూడా చేయకుండా అక్టోబర్ 22 ఉదయం వరకు ఆమెను నిరీక్షించేలా చేశారు. తన వ్యక్తిగత సమయానికి విలువ ఇవ్వకపోవడంతో విసిగిపోయిన రోజా యూనిట్‌కు సమాచారం అందించి నేరుగా విమానంలో ఇంటికి వెళ్లిపోయారు.

ప్రొడక్షన్ యూనిట్ తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి రోజా హీరో వెంక‌టేష్ చెప్పినా ఎలాంటి మాట వినకుండా కోపంగా వెళ్లిపోయిందని వెంకటేష్‌కి తప్పుగా చెప్పి ఉంటారని రోజా భావించారు. ఈ అపార్థం కారణంగానే వెంకటేష్ ఆమెతో సినిమాలు చేయడం తగ్గించారని.. తమిళంలో తాను చేసిన `ఉన్నిదత్తిల్ ఎన్నై కొడుతేన్` రీమేక్‌గా వచ్చిన `రాజా` చిత్రంలో సౌందర్యకు అవకాశం దక్కడానికి కూడా ఇదే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రత్యక్ష శత్రుత్వం లేదని రోజా స్పష్టం చేశారు. రోజా మంత్రి అయిన తర్వాత విమానంలో కలిసినప్పుడు వెంకటేష్ ఎంతో ఆప్యాయంగా పలకరించి... ఆ పదవికి ఆమె నిజంగా అర్హురాలంటూ అప్రిషియేట్ చేశారు. ఇలా మధ్యలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు.. కమ్యూనికేషన్ లోపాలే తమను కలిసి పనిచేయకుండా ఆపాయి తప్ప వ్యక్తిగతంగా ఒక‌రిపై ఒక‌రికి మంచి గౌరవం అలాగే ఉందని దీనిద్వారా స్పష్టమవుతోంది.