Begin typing your search above and press return to search.

కూతురు ఇండస్ట్రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రోజా!

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్ల కారణంగానే వార్తల్లో నిలిచారు.

By:  Madhu Reddy   |   31 Dec 2025 11:10 AM IST
కూతురు ఇండస్ట్రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రోజా!
X

సాధారణంగా మిగతా రంగాలతో పోల్చుకుంటే సినిమా రంగానికి చెందిన చాలా మంది సెలబ్రిటీలు తమ వారసులను తమ బాటలోనే ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలను మొదలుకొని హీరోయిన్లు అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలను తమ వారసత్వంగా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్ల కారణంగానే వార్తల్లో నిలిచారు.

ముఖ్యంగా రోజా గారాలపట్టి అన్షు మాలిక త్వరలోనే ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్ళబోతోందని అలాగే త్వరలోనే సినిమాల్లోకి కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ వార్తలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా తన కూతురు గురించి వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చింది.

రోజా మాట్లాడుతూ.." నా కూతురు ఒక స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతోంది అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరో చెబితే నేను కూడా తెలుసుకుంటాను" అంటూ నవ్వుతూ ఆ రూమర్స్ ని కొట్టి పారేసింది. అలాగే అన్షు మాలిక తల్లి బాటలోనే ఇండస్ట్రీలోకి రాబోతోంది అంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించింది రోజా. దీనిపై ఆమె మాట్లాడుతూ.." మా అన్షు మాలిక లక్ష్యం నటి కావడం కాదు. ఆమె ఒక సైంటిస్ట్ కావాలని కలలు కంటోంది. అందుకే అమెరికాలో ఉంటూ అక్కడే ఉన్నత చదువులపై దృష్టి పెట్టింది. ఇటీవల ఇటాలియన్ భాషను కూడా ఆమె నేర్చుకుంది.

నిజానికి నేను పిల్లల పెంపకం విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తాను. ఆమె ఇష్టాలను ఆమెకే వదిలేసాను. కాబట్టి సైంటిస్ట్ కావాలనుకుంటున్న అన్షు మాలికపై నా ఇష్టాలను రుద్దాలని అనుకోవట్లేదు. ఆమెకు నటనపై ఆసక్తి ఉంటే తప్పకుండా ప్రోత్సహించేదాన్ని. కానీ అన్షు సైంటిస్ట్ కావాలని బాగా తపన పడుతోంది. అందుకు తగ్గట్టుగానే చదువుకుంటుంది. అన్షు చదువులోనే కాదు పేద పిల్లలకు సహాయం చేయడంలో కూడా ముందుంటోంది" అంటూ తన కూతురు గురించి గర్వంగా చెప్పుకొచ్చింది రోజా. ఇక ప్రస్తుతం రోజా అన్షు మాలికపై వస్తున్న రూమర్లకు పులిస్టాప్ పెట్టిందని చెప్పవచ్చు.

రోజా విషయానికి వస్తే నటి మాత్రమే కాదు.. రాజకీయ నాయకురాలిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె రాజేంద్రప్రసాద్ తో ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా తొలిసారి తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, బొబ్బిలి సింహం, భైరవద్వీపం , అన్న, శుభలగ్నం, శ్రీకృష్ణార్జున విజయం ఇలా పలు చిత్రాలు ఈమెకు మంచి విజయాన్ని అందించాయి. తెలుగు, తమిళ్ భాషలోనే కాదు కన్నడలో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.