బంధిఖానా సినిమా అంటూ.. కిడ్నాపర్ నుంచి తృటిలో తప్పించుకున్న నటి!
ఇది బంధీ గురించిన సినిమా .. మీరు వస్తే స్టోరి డిస్కస్ చేద్దామని, ఆడిషన్స్ చేద్దామని కిడ్నాపర్ ఆర్య చెప్పాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆడిషన్స్ కి చెప్పిన సమయానికి హాజరు కాలేకపోయింది.
By: Sivaji Kontham | 1 Nov 2025 3:00 AM ISTఇటీవల ముంబై కిడ్నాపర్, సినీనిర్మాత రోహిత్ ఆర్య కిడ్నాప్ డ్రామా, హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 17 మంది పిల్లలు సహా మొత్తం 19 మందిని సినిమా ఆడిషన్స్ పేరుతో పిలిచి తన స్టూడియోలో బంధించిన రోహిత్ ఆర్య, బంధిఖానాలో ఉన్నవారిని ఉపయోగించుకుని, తనకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 2.4 కోట్ల డబ్బును వసూలు చేయాలని పన్నాగం పన్నాడు.
అతడు తనదైన శైలిలో సినిమాటిక్ కిడ్నాప్ ప్లాన్ ని అమలు చేయడంలో సక్సెసయ్యాడు. ఆడిషన్స్ పేరుతో ఇద్దరు అడల్ట్ ని, 17 మంది పిల్లలను అతడు ఒక స్టూడియోలో ఉంచాడు. ఆ తర్వాత మీ అందరూ కిడ్నాప్ కి గురయ్యారని వారికి చెప్పి భయపెట్టాడు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అతడు ఉంటున్న ఆర్కే స్టూడియోస్ కి వచ్చారు. చివరికి ఈ కిడ్నాప్ డ్రామాలో పోలీసులు అతడిని తుపాకీతో కాల్చి మట్టుపెట్టారు. విజయవంతంగా బంధీలుగా ఉన్నవారందరినీ విడిపించారు.
అయితే రోహిత్ ఆర్య కేసు రెగ్యులర్ కిడ్నాపర్ స్టోరీ కంటే ఎక్కువ. ఈ డ్రామా మొత్తం ఒక సినిమానే తలపించింది అంటే అతిశయోక్తి కాదు. ఈ కిడ్నాప్ డ్రామాలో అసలు హీరోయిన్ గురించిన మరో ట్విస్టు బయటపడింది ఇప్పుడు. సరిగ్గా కిడ్నాపర్ రోహిత్ ఆర్య ఆడిషన్స్ పేరుతో తనను కూడా ముంబైలోని స్టూడియోకి రావాల్సిందిగా పిలిచాడని ప్రముఖ నటి రుచితా విజయ్ జాదవ్ పేర్కొన్నారు.
అక్టోబర్ 4న అతడు పరిచయం అయ్యాడు. అక్టోబర్ 23న తనను ఆడిషన్స్ కి రావాల్సిందిగా పిలిచాడు. కానీ అక్టోబర్ 27 లేదా 28న తాను హాజరవుతానని చెప్పింది. కానీ ఆరోజు తనకు వేరే వ్యక్తిగత పనికి వెళ్లాల్సి రావడంతో ఆడిషన్స్ ని వాయిదా వేసుకుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు టీవీల్లో రోహిత్ ఆర్య అనే కిడ్నాపర్ ని పోలీసులు హతమార్చారని, అతడు 19 మందిని ఆర్.వి సినిమా స్టూడియోస్ లో బంధించి ఉంచాడని తెలుసుకుని షాక్ కి గురయ్యానని రుచితా చెప్పారు. బహుశా అతడు తనను కూడా బంధించాలని ప్లాన్ చేసాడు. కానీ అదృష్టవశాత్తూ అతడికి చిక్కకుండా తప్పించుకోగలిగానని షాకింగ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు రుచితా విజయ్ జాదవ్. ఆ దేవుడే తనను కాపాడాడని కూడా భావించినట్టు తెలిపింది.
ఇది బంధీ గురించిన సినిమా .. మీరు వస్తే స్టోరి డిస్కస్ చేద్దామని, ఆడిషన్స్ చేద్దామని కిడ్నాపర్ ఆర్య చెప్పాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆడిషన్స్ కి చెప్పిన సమయానికి హాజరు కాలేకపోయింది. ఒకవేళ తాను ఆడిషన్ కి వెళ్లి ఉంటే బంధీల్లో ఒకరిగా ఉండేదానిని అని కూడా భయపడుతూ చెప్పింది రుచితా. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో రెండు అర్థం కాని ప్రశ్నలు ఉన్నాయి. సదరు క్రియేటివ్ డైరెక్టర్ ఆర్య తన ప్రణాళిక ప్రకారం బందీల ఎంపిక విషయంలో `సినిమాటిక్ దృక్పథం` కోరుకున్నారా? ఈ మొత్తం విషయాలను అతడు డెమో రీల్ లాగా ఉపయోగించుకోవాలనుకున్నాడా? అలా కాకుండా తనకు ఇంతకుముందు పరిచయం లేని సంబంధం లేని వారిని ఇలా ప్రాక్టికల్ గా బంధీలుగా మార్చడం ద్వారా తన సినిమాకి ఎమోషన్ ని జోడించదలిచాడా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అతడి ప్రణాళిక మిస్ ఫైర్ అవ్వడం వల్లనే తుపాకి గుండుకు బలయ్యాడని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక వీడియోలో ఆర్య ఇలా చెప్పాడు. ప్రభుత్వానికి నా డిమాండ్ నైతికమైనది. 59 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న పట్టణ పారిశుధ్య డ్రైవ్ ప్రాజెక్ట్ `లెట్స్ చేంజ్`ను నడిపించినందుకు తనకు రావాల్సిన రూ. 2.4 కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అని అతడు కోరుకుంటున్నట్టు చెప్పాడు. దానికోసమే ఈ కిడ్నాప్ చేసానని కూడా అతడు అంగీకరించాడు. ``నా దగ్గర పెద్దగా డిమాండ్లు లేవు... చాలా చిన్న డిమాండ్లు.., నైతికతతో కూడుకున్న డిమాండ్లు.. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నేను కొంతమందితో మాట్లాడాలనుకుంటున్నాను.. వారిని ప్రశ్నించాలనుకుంటున్నాను అని రోహిత్ ఆర్య అన్నారు.
పిల్లలను బందీలుగా తీసుకోవడం తన `ప్రణాళిక`లో భాగమని, వారిని బాధపెడతానని కిడ్నాపర్ ఆర్య భయపెట్టే ప్రయత్నం చేసాడు. పోలీసులు ఆర్యను ఆ పని ఆపాలని ఒప్పించేందుకు ప్రయత్నించినా, అతడు లొంగలేదు.. చివరికి తుపాకి బుల్లెట్ ను అతడి గుండెల్లో దించారు. రోహిత్ ఆర్యకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పని లేదని ఆ తర్వాత ప్రకటన కూడా వెలువడింది. వాస్తవానికి పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాలల నుండి రిజిస్ట్రేషన్ ఫీజుగా తప్పుడు విధానంలో డబ్బు వసూలు చేసిన రోహిత్ ఆర్య ప్రభుత్వానికే డబ్బు చెల్లించాల్సి ఉందని మహా ప్రభుత్వం పేర్కొంది.
కానీ రోహిత్ ఆర్య భార్య అంజలి వెర్షన్ వేరొకలా ఉంది. ఆమె విలేకరులతో మాట్లాడుతూ... తన భర్త ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 2.4 కోట్లు డబ్బును రాబట్టుకోవడం కోసం మాత్రమే పోరాడాడని చెప్పారు. కానీ తన భర్తను కాపాడుకోలేకపోయింది.
