అత్యంత పిరికి జేమ్స్ బాండ్ గా కొత్త బాండ్!
రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్‌గా ఎంపికైన నేపథ్యంలో లండన్‌లో ‘ది ఒడిస్సీ’ స్క్రీనింగ్‌లో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా క్రిస్టోఫర్ నోలన్, స్టీవెన్ స్పీల్బర్గ్ సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించారు. డేనియల్ క్రెయిగ్ తర్వాత ఏజెంట్ 007గా ప్యాటిన్సన్ బాధ్యతలు చేపట్టనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
By: Srikanth Kontham | 21 Nov 2026 12:04 PM ISTకొత్త జేమ్స్ బాండ్‌గా పేరు ఖరారైన వేళ రాబర్ట్ ప్యాటిన్సన్ వేదికపై చూపించిన వినయ.. సహచర నటుల సరదా చమత్కారాలు హాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయి. లండన్‌లో `ది ఒడిస్సీస` స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ప్యాటిన్సన్కు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రేక్షకులు, తోటి తారలు చప్పట్లతో ముంచెత్తినప్పుడు ఆయన పెద్దగా నవ్వుతూ తలవంచుకుని తనదైన సిగ్గుతో స్పందించిన తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది.
ఈ వేడుకలో టామ్ హాలండ్‌తో సహా చిత్ర బృందం అంతా ప్యాటిన్సన్ను ప్రోత్సహించగా హోస్ట్ ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో బాండ్ గురించి వివరంగా మాట్లాడుకుందామని.. ప్రస్తుతానికి సినిమా కోసం ఆయన చేసిన కృషిని సంబరం చేసుకుందామని చెప్పడంతో ఆడిటోరియంలో సందడి నెలకొంది. ఎన్నో ఊహాగానాల మధ్య ప్యాటిన్సన్ ప్రతిష్టాత్మక పాత్రలోకి అడుగుపెట్టడం సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది.
మరోవైపు `ది ఒడిస్సీ` చర్చ సందర్భంగా క్రిస్టోఫర్ నోలన్ వేసిన పంచ్ నవ్వులు పూయించింది. సినిమాలో ప్యాటిన్సన్ పోషించిన యాంటినస్ పాత్రను ఉద్దేశించి ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యంత పిరికి జేమ్స్ బాండ్ ఆయనే అవుతారని నోలన్ సరదాగా వ్యాఖ్యానించారు. దానికి తోడు స్టీవెన్ స్పీల్బర్గ్ స్పందిస్తూ మీ సినిమా ప్రభావమే ఆయన ఎంపికకు కారణమైందేమోనని చమత్కరించడం విశేషం.
ఇదే సమయంలో కొత్త బాండ్ ప్రకటనకు ముందే ప్యాటిన్సన్ కొన్ని ప్రమోషనల్ కార్యక్రమాల నుంచి చివరి నిమిషంలో తప్పుకోవడం గమనార్హం. అకాడమీ మ్యూజియం ప్యానెల్.. క్రిటిక్స్ ఛాయిస్ ప్రెస్ కాన్ఫరెన్స్.. గవర్నర్స్ అవార్డుల వంటి వేడుకలకు హాజరు కావాల్సి ఉన్నా ఆయన దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ప్యాటిన్సన్ను కొత్త ఏజెంట్ 007గా అధికారికంగా ఖరారు చేసింది.
చీకటిలో నుంచి వెలుగులోకి తుపాకీతో నడిచి వచ్చే చిన్న వీడియోతో ప్యాటిన్సన్ ఎంపికను ప్రకటించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. డేనియల్ క్రెయిగ్ తర్వాత 2021లో `నో టైమ్ టు డై` అనంతరం ఖాళీగా ఉన్న ఈ స్థానాన్ని ప్యాటిన్సన్ భర్తీ చేస్తున్నారు. డెనిస్ విలెనెవ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ కొత్త బాండ్ చిత్రంలో విలన్.. హీరోయిన్ పాత్రలకు ఎవరిని తీసుకుంటారనే ఆసక్తి ఇప్పటికే మొదలైంది.
