Begin typing your search above and press return to search.

పెద్దల చిత్రమైనా తప్పని సెన్సార్ కత్తెర!

హాలీవుడ్ స్టార్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `ప్రైమ్‌టైమ్` భారతదేశంలో విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Srikanth Kontham   |   26 Sept 2026 8:15 AM IST
పెద్దల చిత్రమైనా తప్పని సెన్సార్ కత్తెర!
X

హాలీవుడ్ స్టార్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `ప్రైమ్‌టైమ్` భారతదేశంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి భారతీయ సెన్సార్ బోర్డు `A` సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కేవలం ఎడల్ట్ సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసి పలు కోతలు విధించింది. సినిమాను నిశితంగా పరిశీలించిన సెన్సార్ బోర్డు ప్రధానంగా 7 సెకన్ల వ్యవధి ఉన్న ఫ్రంటల్ న్యూడిటీ (పూర్తి నగ్నత్వపు) దృశ్యాలను తొలగించాలని ఆదేశించింది.

కేవలం పెద్దలు మాత్రమే చూడదగిన `A` సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ ఇలాంటి అభ్యంతరకర దృశ్యాలను భారతీయ థియేటర్లలో ప్రదర్శించడానికి అనుమతించలేమని స్పష్టం చేస్తూ ఆ దృశ్యాలను ఎడిట్ చేయించింది. స‌న్నివేశాల‌ కోతలతో పాటు ఆడియో విభాగంలోనూ సెన్సార్ బోర్డు పలు మార్పులను సూచించింది. చిత్రంలో వినిపించే అసభ్యకర పదాలు, బూతులు , అభ్యంతరకర సంభాషణలను మ్యూట్ చేయాలని లేదా తొలగించాలని ఆదేశించింది. భారతీయ ప్రదర్శన నిబంధనలకు అనుగుణంగా సంభాషణలు ఉండేలా మేకర్స్ ఆడియో మార్పులను పూర్తి చేస్తున్నారు.

సాధారణంగా హాలీవుడ్ సినిమాలలో ఉండే బోల్డ్ కంటెంట్ లేదా నగ్నత్వం విషయంలో భారతీయ సెన్సార్ బోర్డు చాలా కఠినంగా వ్యవహరిస్తుంటుంది. `Aస‌`సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వకుండా మితిమీరిన నగ్నత్వం .. అశ్లీలత ఉన్న దృశ్యాలను కత్తిరించడం సెన్సార్ బోర్డు నిబంధనల్లో భాగమని ఈ చర్య మరోసారి నిరూపించింది.

రాబర్ట్ ప్యాటిన్సన్ నటిస్తున్న `ప్రైమ్‌టైమ్` చిత్రంపై హాలీవుడ్‌తో పాటు భారతీయ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రంలో ప్యాటిన్సన్ నటన ప్రధాన ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు. సెన్సార్ ప్రక్రియ పూర్తవ్వడంతో సినిమా త్వరలోనే భారతీయ థియేటర్లలో ప్రేక్షకు ముందుకు రానుంది.

అయితే `A` సర్టిఫికేట్ ఇచ్చినా? మళ్లీ సీన్లను కత్తిరించడం, పదాలను మ్యూట్ చేయడంపై విశ్లేషకుల్లో భిన్నా భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దల కోసం ఉద్దేశించిన చిత్రాలలో కూడా ఇలాంటి కోతలు విధించడం వల్ల దర్శకుడి అసలు విజన్ దెబ్బతింటుందని కొందరు అభిప్రాయపడుతుండగా సాంస్కృతిక నిబంధనల ప్రకారం ఇది తప్పదని మరికొందరు సమర్థిస్తున్నారు. మొత్తానికి కోతలతో కూడిన వెర్షనే భారతీయ థియేటర్లలో ప్రదర్శితం కానుంది.