Begin typing your search above and press return to search.

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపికలో తాను కీలక పాత్ర పోషించానని అమెజాన్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ వెల్లడించారు. తొలుత ఆయన ఎంపికపై సందేహించినా, స్క్రీన్ టెస్ట్‌లో ప్యాటిన్సన్ నటన ఆకట్టుకోవడంతో ఓకే చెప్పినట్లు తెలిపారు. డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వంలో 26వ బాండ్ చిత్రం 2028లో విడుదల కానుంది.

By:  Sivaji Kontham   |   19 Nov 2026 8:42 AM IST
కొత్త జేమ్స్ బాండ్- 007 ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?
X

ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కొంత కాలంగా కొత్త బాండ్ 007 ఎవ‌రు? అంటూ డిబేట్ న‌డుస్తోంది. సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త `జేమ్స్ బాండ్- 007` ఎంపిక కూడా చాలా పెద్ద చ‌ర్చ‌గా మారింది. తాజాగా ఈ ఎంపిక‌పై అమెజాన్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ట్విలైట్, ది బ్యాట్‌మ్యాన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్‌ను కొత్త బాండ్‌గా ఎంచుకోవడంలో తాను ప్రత్యక్షంగా కీలక పాత్ర పోషించినట్లు బెజోస్ తెలిపారు. డేనియల్ క్రెయిగ్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీలో 7వ జేమ్స్ బాండ్‌గా ప్యాటిన్సన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

కాలిఫోర్నియాలో జరిగిన `సెమాఫోర్ సిలికాన్ వ్యాలీ & ది వరల్డ్` ఈవెంట్‌లో మాట్లాడిన బెజోస్ మొదట్లో ప్యాటిన్సన్ ఎంపికకు తాను వ్యతిరేకంగా ఉన్నట్లు అంగీకరించారు. సాధారణంగా 007 పాత్రకు అంతగా పాపులారిటీ లేని కొత్త నటులను తీసుకోవడం ఆనవాయితీ అని.. ప్యాటిన్సన్ ఇప్పటికే పెద్ద స్టార్ కావడంతో తాను కొంత సంకోచించానని చెప్పారు. అయితే తుది జాబితాలో ఉన్న ఐదుగురు నటులకు పూర్తి కాస్ట్యూమ్స్, రియల్ సెట్స్‌తో మూడు వేర్వేరు సన్నివేశాల్లో పాత పద్ధతిలో స్క్రీన్ టెస్ట్ నిర్వహించినప్పుడు ప్యాటిన్సన్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారని.. అతడే అసలైన జేమ్స్ బాండ్ అని వెంటనే స్పష్టమైందని బెజోస్ వివరించారు.

ఈ ఎంపిక ప్రక్రియలో దర్శకుడు `డెనిస్ విల్లెన్యూవ్` సహా చిత్ర బృందం అంతా ఏకగ్రీవంగా రాబర్ట్ వైపే మొగ్గు చూపారని బెజోస్ పేర్కొన్నారు. 1962 నుంచి జేమ్స్ బాండ్ సిరీస్‌ను నిర్మిస్తున్న బ్రోకోలీ కుటుంబం క్రియేటివిటీ టాస్కుల్లో ఫింగ‌రింగ్ చేయ‌కుండా వస్తున్న తొలి అధికారిక బాండ్ చిత్రం ఇదేన‌ని కూడా తెలుస్తోంది. 2022లో ఎంజీఎం స్టూడియోను కొనుగోలు చేసిన అమెజాన్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని కొత్త కోణంలో ముందుకు తీసుకెళ్తోంది. మరోవైపు 007 వంటి దిగ్గజ పాత్రకు ఎంపికవడం తన జీవితకాల గౌరవమని లండన్‌లో జన్మించిన ప్యాటిన్సన్ ఆనందం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం హాలీవుడ్‌లో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం స్టూడియోలకు పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో కొత్త నటుడితో ప్రయోగం చేయడం కంటే బాక్సాఫీస్ వద్ద నమ్మకమైన స్టార్ ప్యాటిన్సన్‌ను ఎంచుకోవడమే సురక్షితమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. ప్యాటిన్సన్ ప్రదర్శనలో ఏదో ప్రత్యేకత ఉందని బెజోస్ న‌మ్మ‌కంగా ఉన్నారు. డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ 26వ జేమ్స్ బాండ్ చిత్రం 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది.