పవన్, విజయ్ సక్సెస్.. సూర్య డైరెక్టర్ ఒపీనియన్ ఏంటి?
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. "విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు చాలామంది నమ్మలేదు. విమర్శించారు. నెగిటివ్ ప్రచారం చేశారు.
By: M Prashanth | 12 May 2026 3:01 PM ISTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పొలిటికల్ జర్నీలపై డైరెక్టర్ కమ్ యాక్టర్, ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన బాలాజీ.. పవన్, విజయ్ ల విజయాల వెనుక ఉన్న అసలు రీజన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని తెలిపారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన వీరభద్రుడు చిత్రం మే 14న విడుదలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా విశేషాలతో పాటు రాజకీయ నాయకుల పొలిటికల్ సక్సెస్ లపై కూడా ఆర్జే బాలాజీ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విజయ్, పవన్ కళ్యాణ్ లను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. "విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు చాలామంది నమ్మలేదు. విమర్శించారు. నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ ఆయన మాత్రం తన లక్ష్యాన్ని వదల్లేదు. తనపై తనకు ఉన్న నమ్మకంతో ముందుకు సాగారు. అదే నమ్మకం ప్రజల్లోకి వెళ్లి, ఇవాళ ఆయనను తమిళనాడు ముఖ్యమంత్రిగా నిలబెట్టింది" అని అన్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఎన్నో విమర్శలు వచ్చాయి. రాజకీయంగా నిలబడలేరని అనేవారు కూడా ఉన్నారు. కానీ ఆయన తన ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ప్రజలు ఆయనను నమ్మారు. అందుకే ఆయనకు విజయం దక్కింది" అని చెప్పారు.
మనల్ని మనం నమ్ముకోవడం ఎంత ముఖ్యమో పవన్, విజయ్ ల రాజకీయ ప్రయాణాలు నిరూపించాయని బాలాజీ అభిప్రాయపడ్డారు. "మన మీద మనకు 100 శాతం నమ్మకం ఉంటే, అది ఒక శక్తిగా మారుతుంది. అదే ఇతరులకు కూడా చేరుతుంది. విజయ్, పవన్ ఇద్దరి ప్రయాణాల్లో అదే కనిపించింది" అని పేర్కొన్నారు. ఇక తన సినీ ప్రయాణాన్ని కూడా ఈ ఉదాహరణలతో కలిపి వివరించారు.
"నేను వీరభద్రుడు సినిమా చేస్తున్నప్పుడు కూడా చాలామంది ప్రశ్నించారు. సూర్య లాంటి స్టార్ హీరో.. మణిరత్నం, సుధా కొంగర వంటి దర్శకులతో పనిచేసిన తర్వాత నాతో సినిమా చేయడమేంటని అడిగారు. కానీ సూర్య సర్ కు నా మీద నమ్మకం ఉంది. అలాగే నా విజన్‌పై నాకు క్లారిటీ ఉంది" అని తెలిపారు. ఎదురుదెబ్బలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా, మనల్ని మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా విజయం సాధించవచ్చని బాలాజీ చెప్పారు.
ఆర్జేగా కెరీర్ ప్రారంభించి నటుడిగా, ఇప్పుడు దర్శకుడిగా ఎదిగిన తన ప్రయాణం కూడా అదే విషయాన్ని చెబుతోందన్నారు. అలా ఈవెంట్ లో బాలాజీ చేసిన వ్యాఖ్యల్లో రాజకీయాల కంటే ఎక్కువగా సెల్ఫ్ బిలీఫ్ గురించి సందేశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, విజయ్ ను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి. సినీ, రాజకీయ రంగాల్లో విమర్శలు సహజమే అయినా.. నమ్మకం, పట్టుదల ఉంటే టార్గెట్ ను చేరుకోవచ్చని బాలాజీ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.
