Begin typing your search above and press return to search.

టీమిండియా కెప్టెన్ భార్య స్థిరాస్తి పెట్టుబ‌డుల విలువ‌?

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసార‌ని క‌థ‌నాలొస్తున్న‌యి.

By:  Sivaji Kontham   |   10 Jan 2026 9:53 AM IST
టీమిండియా కెప్టెన్ భార్య స్థిరాస్తి పెట్టుబ‌డుల విలువ‌?
X

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసార‌ని క‌థ‌నాలొస్తున్న‌యి. ఈ అపార్ట్ మెంట్ విలువ 27కోట్లు. ముంబై- వర్లి ప్రాంతంలో ఉన్న హైరైజ్ టవర్‌లో ఈ ఫ్లాట్ ఉంది. వర్లి ప‌రిస‌రాల్లో ఇప్పటికే విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వంటి స్టార్ క్రికెటర్లకు సొంత నివాసాలు ఉన్నాయి.

దాదాపు 26 కోట్ల విలువ చేసే ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. ఇందుకోసం రితికా సుమారు రూ.1.50 కోట్లకు పైగా స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం. ఈ అపార్ట్ మెంట్ ఉన్న హైరైజ్ భ‌వంతి నుండి ముంబై సీ-లింక్, అరేబియా సముద్రం అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది. రితికా కొనుగోలు చేసిన కొత్త అపార్ట్‌మెంట్‌లో 2,761 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉంది. మూడు కార్లు పార్క్ చేయడానికి స్థలం కూడా ఉంది. 2025 డిసెంబర్ 12న రితికా ఈ నివాసాన్ని రిజిస్టర్ చేయించుకుంది. రోహిత్ శర్మకు ఇప్పటికే వర్లిలోని అహుజా టవర్స్ లో 29వ అంతస్తులో 30 కోట్ల ఖ‌రీదైన ఒక భారీ అపార్ట్‌మెంట్ ఉంది. ఇప్పుడు కొన్న కొత్త ఫ్లాట్ అద‌న‌పు మ‌ణిహారం.

రోహిత్ శర్మ, రితికా దంపతులకు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. నవంబర్ 2024లో ఈ దంప‌తుల‌కు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ కుటుంబం పెద్దదవ్వడంతో మరింత సౌకర్యవంతమైన నివాసం కోసం ఈ కొత్త అపార్ట్‌మెంట్‌ను తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ త‌ర్వాత అత‌డి నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న వ‌స్తుందోన‌ని వేచి చూడాలి. రితికా తన భర్త స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వ్యవహారాలను చూసుకోవడంతో పాటు రియ‌ల్ పెట్టుబ‌డుల బాధ్యతను కూడా నిర్వహిస్తున్నారు.

ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సెలబ్రిటీల పెట్టుబడులు పెరిగాయి. ఇటీవలే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బ‌చ్చ‌న్, సోన‌మ్ కపూర్, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, వివేక్ ఒబెరాయ్, రణవీర్ సింగ్ కూడా కోట్లాది రూపాయల విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ముంబై ఔట‌ర్ లో చాలా మంది సెల‌బ్రిటీల‌కు ఖ‌రీదైన ఫామ్ హౌస్ లు ఉన్నాయి.