కొరియన్ భాషలో రితికా నాయక్ ముచ్చట్లు.. అదరగొట్టిన సత్య ట్రాన్స్‌లేషన్
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన హారర్ కామెడీ సినిమా 'కొరియన్ కనకరాజు' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
By: M Prashanth | 15 Aug 2026 9:40 AM ISTవరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన హారర్ కామెడీ సినిమా 'కొరియన్ కనకరాజు' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం వైజాగ్‌లో ఒక సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సినిమాలోని ముఖ్య పాత్రధారులు అందరూ పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇదే వేదికపై హీరోయిన్ రితికా నాయక్, కమెడియన్ సత్య మధ్య జరిగిన ఒక ఫన్నీ సీన్ హైలెట్ అయ్యింది.
సినిమాలోని పాత్రకు తగ్గట్టుగా రితికా నాయక్ సక్సెస్ మీట్ లో కొరియన్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. ఆమె ప్రతి మాటను సత్య తనదైన శైలిలో తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం అందరిని నవ్వించింది. మొదట రితికా వైజాగ్.. అని కొరియన్ భాషలో ఏదో చెప్పగా, "వైజాగ్ వాసులందరికీ నా ముద్దులు" అని సత్య సరదాగా ట్రాన్స్‌లేట్ చేసి చెప్పారు.
ఆ తర్వాత రితికా నాయక్ కొరియన్ కనకరాజు అంటూ మరొకటి చెప్పగా, సత్య సత్య ఫ్యాన్స్ అందరికీ అని ట్రాన్స్‌లేట్ చేసి నవ్వించారు. మళ్ళీ కొరియన్ భాషలోకి మారుతూ మరేదో చెప్పగా, సత్య " ఆ బీచ్ ఒడ్డున తిన్న మురి మిక్చర్ చాలా నచ్చిందని" అని ఫన్నీగా ట్రాన్స్‌లేట్ చేశారు. రితికా నాయక్ మళ్ళీ మరొకటి చెప్పగా, దానికి సత్య "కాకపోతే వాడు మిర్చి కొంచెం వేశాడంట, కడుపు మంటగా ఉందట, డోంట్ వర్రీ నేను ప్రోబయోటిక్ ఇస్తాను" అని చెప్పి హైలెట్ చేశాడు.
చివరగా రితికా నాయక్ మరింత వివరణ ఇవ్వగా సత్య "దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్" అని ట్రాన్స్‌లేట్ చేసి, "అయినా రేపు కదా ఇండిపెండెన్స్ డే, ముందే అందరికీ అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే టు ఆల్ వైజాగ్ పీపుల్, ఇప్పుడు తను నిజమైన తెలుగు స్పీచ్ ఇస్తుంది" అని ఫన్నీగా ముగించారు.
ఈ ట్రాన్స్‌లేషన్ పై యాంకర్ స్పందిస్తూ, "సత్య గారు పాపం అమాయకురాలిని చేసి ఇంత మోసం చేస్తారా ఆవిడని, ఆవిడ చెప్పిందేంటి మీరు ట్రాన్స్‌లేట్ చేసిందేంటి?" అని అడిగారు. దానికి సత్య నవ్వుతూ, "అది కాదా, సారీ నువ్వు తెలుగులోనే మాట్లాడు" అని రితికా నాయక్ తో చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ తో సక్సెస్ మీట్ మరింత సందడిగా సాగింది.
కమెడియన్ సత్య సినిమాలో చేసిన పాత్రకు. మెగాస్టార్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఎక్కడ తగ్గకుండా తన కామెడీతో సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చినట్లు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇక నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంటుందని ఇటీవల వరుణ్ తేజ్ ఇదే వేడుకలో క్లారిటీ ఇచ్చాడు. కానీ రొటీన్ గా తొందరగా చేయకుండా మంచి స్క్రిప్ట్ సిద్ధమైతేనే చేస్తామని అన్నారు.
