శెట్టి గ్యాంగ్ లో ఏం జరుగుతోంది? కారణమేంటి?
శెట్టి గ్యాంగ్ గా పేరు తెచ్చుకున్న ముగ్గురు శెట్టిల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయా? అనే చర్చ కన్నడ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 28 March 2026 11:45 PM ISTశెట్టి గ్యాంగ్ గా పేరు తెచ్చుకున్న ముగ్గురు శెట్టిల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయా? అనే చర్చ కన్నడ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి.. కొత్త తరహా కంటెంట్ తో కన్నడ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లిన క్రియేటివ్ ట్రియో. బ్లడ్ రిలేషన్ లేకపోయినా.. సినిమా పట్ల ఉన్న అభిరుచి వీరిని ఒకటిగా నిలబెట్టింది. అయితే వారి ఫ్రెండ్ షిప్ లో అభిప్రాయ భేదాలు వచ్చాయని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
కాంతార 2 విజయంతో రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగింది. ఆ విజయంతో పాటు ఆయన మార్కెట్ కూడా పెరిగింది. అదే సమయంలో హోంబలే ఫిల్మ్స్ తో ఆయన పారితోషికం విషయంలో విభేదాలు తలెత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ చర్చలు సాధారణ స్థాయిని దాటి మరింత తీవ్రమయ్యాయని అంటున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడకపోయినా, కొన్ని సోషల్ మీడియా పరిణామాలు ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
తాజాగా రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా ఖాతాల్లో రాజ్ బి శెట్టి, హోంబలే ఫిల్మ్స్, హీరోయిన్ రుక్మిణి వసంత్ ను అన్ ఫాలో చేసినట్లు గమనించారు నెటిజన్లు. ఆ ఒక్క చర్యే ఇప్పుడు అనేక అనుమానాలకు కారణమైంది. సాధారణంగా ఇలాంటి చర్యలు పర్సనల్ లేదా ప్రొఫెషనల్ డిస్టర్బెన్స్ కు సిగ్నల్ గా భావిస్తారు. దీంతో శెట్టి గ్యాంగ్ లో అంతర్గత విభేదాలు నిజమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు, రక్షిత్ శెట్టి తో రిషబ్ సంబంధాలు ఎలా ఉన్నాయన్నదానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఆ ఇద్దరూ కలిసి పలు విజయవంతమైన ప్రాజెక్టుల్లో పని చేశారు. వారి మధ్య ఉన్న అనుబంధం అభిమానులకు ప్రత్యేకంగా కనిపించేది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో రిషబ్ శెట్టి రక్షిత్ నుంచి కూడా దూరమవుతారా? లేక ఆ వార్తలు కేవలం ఊహాగానాలేనా? అన్నది తెలియాల్సి ఉంది.
అయితే భారీ విజయాల తర్వాత పారితోషికం, క్రియేటివ్ కంట్రోల్ వంటి అంశాల్లో విభేదాలు రావడం సాధారణమేనని ఇప్పుడు పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఒక నటుడు లేదా దర్శకుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు, వారి డిమాండ్లు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలతో చర్చలు కఠినంగా మారే అవకాశముంది.
అయితే ఆ వివాదాలపై శెట్టి గ్యాంగ్ నుంచి ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదు. అందువల్ల ఆ వార్తలు నిజమా? లేక సోషల్ మీడియా ఊహాగానాలేనా? అన్నది తేలాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఆ ముగ్గురు మళ్లీ కలిసి మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు. ఏదేమైనా శెట్టి గ్యాంగ్ మధ్య విభేదాలపై వస్తున్న వార్తలు కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
