Begin typing your search above and press return to search.

హోంబలే, రిషబ్ మధ్య అసలు గొడవేంటి? ఎవరూ స్పందించరేంటి?

కన్నడ సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారాయి నటుడు రిషబ్ శెట్టి, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మధ్య విభేదాలపై వస్తున్న వార్తలు.

By:  M Prashanth   |   15 April 2026 9:55 AM IST
హోంబలే, రిషబ్ మధ్య అసలు గొడవేంటి? ఎవరూ స్పందించరేంటి?
X

కన్నడ సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారాయి నటుడు రిషబ్ శెట్టి, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మధ్య విభేదాలపై వస్తున్న వార్తలు. కాంతార వంటి బ్లాక్‌ బస్టర్ సినిమాతో ఆ కాంబినేషన్‌ కు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా ద్వారా రిషబ్ శెట్టి ఓ రేంజ్ లో అభిమానులను సంపాదించుకోగా, హోంబలే ఫిల్మ్స్ ప్రముఖ నిర్మాణ సంస్థగా మరింత క్రేజ్ పొందింది.

ఇలాంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌ లో ఇప్పుడు విభేదాలు వచ్చాయనే ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా ఖాతాల్లో హోంబలే ఫిల్మ్స్‌కు సంబంధించిన అధికారిక అకౌంట్లను అన్‌ ఫాలో చేయడం ఆ వార్తలకు కారణమైంది. అంతేకాకుండా, నటుడు రాజ్ బి శెట్టి, హీరోయిన్ రుక్మిణి వసంత్‌లను కూడా ఆయన అన్‌ఫాలో చేయడం గమనార్హం.

దీంతో కాంతార టీమ్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయనే అనుమానాలు మరింత పెరిగాయి. అయితే ఇదే సమయంలో హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇది పూర్తిగా విభేదాలేనా? లేక వ్యక్తిగత కారణాలా? అన్న సందేహాలు కొన్ని రోజులుగా వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటి వరకు ఆ అంశంపై అటు రిషబ్ శెట్టి గానీ, ఇటు హోంబలే ఫిల్మ్స్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రిషబ్ అన్‌ ఫాలో వెనుక కుటుంబ సంబంధిత అంశాలే కారణమని రూమర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా, రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి పాత్ర కూడా ఉందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాంతార ఫ్రాంచైజీలో భాగంగా రూపొందనున్న తదుపరి భాగంలో ఆమెను కో-ప్రొడ్యూసర్‌ గా చేర్చాలన్న ఆలోచన ఉందని, అయితే దీనికి హోంబలే ఫిల్మ్స్ అంగీకరించలేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అభిప్రాయ భేదాలు రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే ఆ వార్తలన్నీ ప్రస్తుతం కేవలం రూమర్లే. అసలు విషయంపై స్పష్టత రావాలంటే సంబంధిత వ్యక్తులు అధికారికంగా స్పందించాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా కాంతార సిరీస్‌ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి, రిషబ్ శెట్టి – హోంబలే ఫిల్మ్స్ మధ్య విభేదాలపై వస్తున్న వార్తలకు ఇంకా స్పష్టత రాలేదు. ఎవరూ స్పందించకపోవడంతో రూమర్లకు మరింత ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రేక్షకులు అఫీషియల్ క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు.