అప్పుడు కాంతార సీన్ వివాదం.. ఇప్పుడు రిషబ్ శెట్టి క్లారిటీ..
కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి.. మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే
By: M Prashanth | 9 Oct 2025 1:00 AM ISTకన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి.. మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం సాధించిన ఆ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 మూవీని రూపొందించారు.
దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఆ సినిమా.. బ్లాక్ బస్టర్ టాక్ అందుకుని దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు రూ.400 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి.. సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ కూడా పోస్ట్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
అందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి.. తన సినిమాల్లో మహిళా పాత్రలపై వచ్చిన విమర్శలపై స్పందించారు. నిజానికి.. కాంతార మూవీ సమయంలో ఓ సీన్ పై పెద్ద ఎత్తున చర్చ సాగింది. శివ రోల్ లో రిషబ్.. హీరోయిన్ నడుము తాకే సన్నివేశంపై అనేక మంది విమర్శలు గుప్పించారు. తీవ్రంగా కామెంట్లు పెట్టారు.
ఇప్పుడు ఆ విషయంపై రిషబ్ మాట్లాడారు. శివ పాత్రలో మంచి, చెడు రెండూ ఉంటాయని, ఆ సన్నివేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. సినిమా కథ అతడి తప్పులు, వాటి పరిణామాల గురించి, చివరికి అతను ఎలా మారాడన్నదానిపైనే ఉందని తెలిపారు. సినిమాలో తల్లి పాత్రను బలంగా రూపొందించామని వెల్లడించారు.
కథ పరంగా ఆమె పాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉందని వివరించారు. సినిమా సమాజాన్ని ఎలా ఉందో అలా చూపిస్తుందని, ఇందులో మంచి, చెడు రెండూ ఉంటాయని తెలిపారు. దర్శకులకు వాస్తవాన్ని చూపించే స్వేచ్ఛ ఉందని చెప్పారు. ప్రేక్షకుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటాడన్నది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు.
సినిమాలో మహిళల పాత్రలను బలంగా చూపించమని తెలిపారు. కానీ కథా అవసరాల మేరకే పాత్రలు సాగాలని చెప్పారు. ప్రజల అభిప్రాయాల కోసం కథను మార్చలేమని అన్నారు. అదే సమయంలో తన రోల్ బాగా రాశారని కాంతార ఛాప్టర్ 1 హీరోయిన్ రుక్మిణీ వసంత్ తెలిపారు. నటిగా, వ్యక్తిగతంగా ఇదొక మంచి అనుభవమని అన్నారు. విమర్శల కంటే కథను నిజాయితీగా చెప్పడమే తమ టీం లక్ష్యమని చెప్పుకొచ్చారు.
