Begin typing your search above and press return to search.

దేశం దాటిన ప్రతిభ.. రిషబ్ శెట్టికి అంతర్జాతీయ సత్కారం!

భారతీయ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చినందుకుగాను ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 'లీడర్షిప్ ఇన్ సినిమా' అవార్డుతో రిషబ్ శెట్టిని సత్కరించనున్నారు.

By:  Madhu Reddy   |   29 July 2026 2:29 PM IST
దేశం దాటిన ప్రతిభ.. రిషబ్ శెట్టికి అంతర్జాతీయ సత్కారం!
X

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2017లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈయన.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ 2016లో రికి, కిరిక్ పార్టీ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన బెల్ బాటమ్ చిత్రంలో హీరోగా నటించి నటుడిగా కూడా పరిచయమయ్యారు. వాస్తవానికి ఫిలిం డైరెక్షన్లో డిప్లమా పూర్తి చేసిన ఈయన కన్నడ దర్శకుడు ఏ ఎం ఆర్ రమేష్ వద్ద సైనైడ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. 2010లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

రిషబ్ శెట్టి కి ప్రతిష్టాత్మక అవార్డు..

దాదాపుగా దశాబ్ద కాలానికి పైగా కన్నడ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన రిషబ్ శెట్టి.. కాంతారా చిత్రంతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2022లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడిగా కూడా పనిచేయడం గమనార్హం. ముఖ్యంగా ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు రిషబ్ శెట్టి. ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం జై హనుమాన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టి కి తాజాగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

లీడర్షిప్ ఇన్ సినిమా అవార్డు..

భారతీయ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చినందుకుగాను ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 'లీడర్షిప్ ఇన్ సినిమా' అవార్డుతో రిషబ్ శెట్టిని సత్కరించనున్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రిషబ్ శెట్టికి ఆగస్టు 13వ తేదీన ఈ అవార్డును ప్రధానం చేయబోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజెన్లు రిషబ్ శెట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రిషబ్ శెట్టి ప్రస్తుత సినిమాలు..

రిషబ్ శెట్టి ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఆయన దర్శకత్వం వహిస్తున్న జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా నటిస్తున్నారు. అలాగే 18 వ శతాబ్దపు బెంగాల్ నేపథ్యంలో రాబోతున్న ద్విభాష చిత్రంలో కూడా నటిస్తున్నారు. దీనికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే చత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు కాంతారా చాప్టర్ 2లో కూడా నటిస్తున్నారు రిషబ్ శెట్టి.. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకవైపు హీరోగా, మరొకవైపు దర్శకుడిగా సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్న రిషబ్ శెట్టి.. నిర్మాతగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. పలు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ దూసుకుపోతున్న ఈయన.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ 126వ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.