రిషబ్ తీసుకున్న తెలివైన నిర్ణయం ఏంటో తెలుసా..!
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కన్నడ హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు వందల కోట్ల హీరో.
By: Ramesh Palla | 14 Oct 2025 11:39 AM ISTతీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కన్నడ హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు వందల కోట్ల హీరో. హీరోగా నటించడంతో పాటు, దర్శకుడిగానూ తన ప్రతిభను చాటి చెప్పిన రిషబ్ శెట్టి కాంతార రెండు పార్ట్‌లతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన విషయం తెల్సిందే. కాంతార ముందు వరకు కేవలం కన్నడంకు పరిమితం అయిన రిషబ్ శెట్టి ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. ఇండియాలో ఉన్న వారికి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినిమాల ప్రేక్షకులకు ఇప్పుడు కాంతారతో రిషబ్ శెట్టి దగ్గర అయ్యాడు. అలాంటి రిషబ్ శెట్టి జాగ్రత్తగా కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగానే రిషబ్ శెట్టి తదుపరి సినిమాల విషయంలో చాలా చర్చ జరుగుతోంది. కన్నడ సినిమాలు చేస్తూనే మరో వైపు తెలుగు సినిమాల వైపు రిషబ్ శెట్టి అడుగులు వేయాలి అనుకోవడం చాలా తెలివైన నిర్ణయంగా అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి
కన్నడంలోనే పాన్ ఇండియా సినిమాలు చేస్తాను, కన్నడంలో నేను చేసిన సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు చూస్తున్నారు కదా అనే ఆలోచన చేయకుండా మంచి సినిమా ఆఫర్ ఏ భాష నుంచి వచ్చినా స్వీకరించేందుకు రెడీగా ఉన్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ సలహా, సూచన మేరకు తెలుగులో వరుస సినిమాలను రిషబ్ శెట్టి కమిట్ అయ్యాడు అని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. మరో వైపు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనూ ఒక సినిమాను చేసేందుకు గాను అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. త్వరలోనే సితార నాగ వంశీ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తాడని మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
కాంతార చాప్టర్ 2 కి ఏర్పాట్లు షురూ
కాంతార చాప్టర్ 1 కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ నేపథ్యంలో కాంతార చాప్టర్ 2 పై అంచనాలు పెరిగాయి. అందుకే చాప్టర్ 2 కి సంబంధించిన ప్రిపరేషన్స్‌ను రిషబ్ శెట్టి మొదలు పెట్టాడని ఇటీవల కన్నడ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో రిషబ్ శెట్టి తెలుగు భాషను నేర్చుకునేందుకు ప్రతి రోజూ కొంత సమయం కేటాయించాడని కూడా తెలుస్తోంది. ఎన్టీఆర్ సూచన మేరకు ఒక తెలుగు టీచర్‌ను నియమించుకుని మరీ తెలుగు నేర్చుకుంటున్నాడట. రిషబ్ శెట్టి ప్రస్తుతం కమిట్ అయిన రెండు సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కోసం ఈ పని చేస్తున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఏ హీరో అయిన చేసిన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటేనే బాగుంటుంది, అంతే కాకుండా భాష తెలిస్తే మరింత బాగా నటించే అవకాశం ఉంటుంది. అందుకే తెలుగు భాషను రిషబ్ నేర్చుకుంటున్నాడట.
టాలీవుడ్‌లో రిషబ్ శెట్టి మరిన్ని సినిమాలు
రిషబ్ శెట్టి చాలా ప్రతిభ ఉన్న నటుడు, దర్శకుడు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాంతార చాప్టర్ 1 కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయట పడ్డాడు అంటారు. అలాంటి పట్టుదల ఉన్న రిషబ్ శెట్టి ఖచ్చితంగా టాలీవుడ్‌లో మంచి పాత్రలు దక్కించుకోవడం ఖాయం. అందుకే తెలుగు వచ్చి ఉంటే మరింతగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నాడు. రిషబ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు. తెలుగులో రిషబ్ శెట్టి వరుస పెట్టి సినిమాలు చేయక పోవచ్చు, అయితే ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేసినా ఫర్ఫెక్ట్‌గా తెలుగు మాట్లాడటం వస్తే అన్ని విధాలుగా బాగుంటుంది అని ఆయన అభిమానులు సైతం అనుకుంటున్నారు. కన్నడంలో చేసే సినిమాలకు తెలుగులో రిషబ్ శెట్టి డబ్బింగ్ చెప్పినా అది కూడా చాలా బాగుంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి తెలుగు నేర్చుకోవడం అనేది రిషబ్ శెట్టి తీసుకున్న తెలివైన నిర్ణయం అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
