చుక్కల్లో 'కాంతార చాప్టర్ -1' ఓటీటీ రైట్స్
తాజా సమాచారం మేరకు.. దర్శకనిర్మాతలు పలు నగరాల్లో భారీ ప్రచార ఫర్వానికి ప్లాన్ చేసారని తెలుస్తోంది.
By: Sivaji Kontham | 14 Sept 2025 10:41 AM ISTరిషబ్ శెట్టి ఆల్ రౌండర్ పనితనం వందల కోట్ల సంపదల్ని సృష్టిస్తోంది. కన్నడ సినీరంగం నుంచి ప్రతిష్ఠాత్మక హోంబలే ఫిలింస్ అండదండలతో రిషబ్ శెట్టి ఇప్పుడు `కాంతార చాప్టర్ 1` (ప్రీక్వెల్) ని తెరకెక్కించారు. దర్శకహీరోగా ఆయన నైపుణ్యం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు భారీ రిలీజ్ కోసం ఏర్పాట్లలో ఉన్నారు.ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా 2 అక్టోబర్ 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కాంతార గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో ఈ ప్రీక్వెల్ చిత్రం ప్రేక్షకులలో అద్భుతమైన హైప్‌ను సృష్టిస్తోంది.
తాజా సమాచారం మేరకు.. దర్శకనిర్మాతలు పలు నగరాల్లో భారీ ప్రచార ఫర్వానికి ప్లాన్ చేసారని తెలుస్తోంది. కాంతార చిత్రం పాన్ ఇండియాలో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కన్నడ, తమిళం, తెలుగు, హిందీ, మలయాళంలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు పంపిణీ వర్గాలతో సర్వసన్నాహకాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వీలున్న ప్రతి టెరిటరీలోను ప్రేక్షకులను చేరుకోవడానికి నిర్మాతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజా సమాచారం మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఓటీటీ డీల్ ని ఖరారు చేసారని సమాచారం. ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు రూ. 125 కోట్లకు అమ్ముడయ్యాయి. ట్రైలర్ 20 సెప్టెంబర్ 2025న విడుదల కానుంది. పోస్టర్లు, టీజర్ కి అద్భుత స్పందన వచ్చిన నేపథ్యంలో ట్రైలర్ మరింత హైప్ పెంచుతుందని భావిస్తున్నారు.
పురాణాల నుంచి కథలు, చారిత్రక కథలు, జానపదంతో ముడిపడిన కథలకు ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుంది. ఇప్పుడు రిషబ్ శెట్టి సామాజిక- జాన పద అంశాలతో కళాత్మకతతో ముడిపడిన కథను అద్భుతంగా తెరకెక్కించారని కథనాలొస్తున్నాయి. మొదటి భాగంతో పోలిస్తే కాంతార ప్రీక్వెల్ లో భారీ యాక్షన్ కి ఆస్కారం ఉందని అంచనా. ప్రజలు థియేటర్లలో ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
